కరోనాతో చనిపోయిన పోలీసులకు రూ. 3 లక్షల సాయం ప్రకటించిన ఫార్మా కంపెనీ

కరోనాతో చనిపోయిన పోలీసులకు రూ. 3 లక్షల సాయం ప్రకటించిన ఫార్మా కంపెనీ

ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన మ్యాన్ కైండ్ ఫార్మా కరోనా బారినపడి మరణించిన పోలీసుల కుటుంబాలకు రూ.5 కోట్ల విరాళమిచ్చింది. ప్రజలను కరోనా నుంచి కాపాడటం కోసం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసి.. అమరులైన పోలీసుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశ పోలీసు యంత్రాంగం ముందువరుసలో నిలిచింది. ఈ ప్రక్రియలో అంకితభావం గల పోలీసులెందరో తమ ప్రాణాలను కోల్పోయారు. అందుకే బాధ్యత కలిగిన ఒక సంస్థగా ‘మ్యాన్ కైండ్ ఫార్మా’ ఈ వీరుల కుటుంబాలకు అండగా నిలవాలని అనుకుంది. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి చనిపోయిన పోలీసుల కోసం రూ.5 కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాంటి వీరులకు చెందిన ప్రతీ కుటుంబానికి కంపెనీ రూ.3 లక్షల చొప్పున విరాళం ఇవ్వనుంది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ‘మ్యాన్ కైండ్ ఫార్మా’ అనేక విధాలుగా పాల్గొంటోంది. తమ కంపెనీలో అందుబాటులో ఉన్న ఔషధాలను ఉత్పత్తి చేసింది. వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, మరియు సంబంధిత ఔషధాలను రాష్ట్రాలకు సరఫరా చేసింది.

దేశంలో కరోనా మహమ్మారి ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ కంపెనీ రూ.51 కోట్లను సీఎం సహాయ నిధికి విరాళంగా అందించింది. అంతేకాకుండా.. ఈ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కూడా తమ ఒక రోజు జీతాన్ని సహాయ నిధికి విరాళంగా అందించారు. ఇటీవలే మ్యాన్ కైండ్ ఫార్మా.. రామ సాహు (ఒడిషా), జ్యోతి కుమారి (బీహార్), మోహన్ (మధురై), అక్షయ్ కొథావా (పుణె), దేవ్ గనియా (సూరత్)లకు రూ. లక్ష చొప్పున సాయం అందించింది. ఈ సందర్భంగా ‘మ్యాన్ కైండ్ ఫార్మా’ సీఈఓ శ్రీ రాజీవ్ జునేజా మాట్లాడుతూ.. ‘తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనాను ఎదుర్కోవడంలో పోలీసు వీరులు తమ సాహసాన్ని ప్రదర్శించారు. కరోనా నియంత్రణలో వైద్యుల తరువాత ముందువరుసలో నిల్చున్నది పోలీసులే. ఆ మహమ్మారితో పోరాడుతూ.. మనల్ని కాపాడుతూ.. ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారు. వారు అందించిన అమూల్య సేవలను, ప్రదర్శించిన మానవత్వాన్ని దేశం మర్చిపోకూడదు. అందుకే చనిపోయిన పోలీసుల కుటుంబాలకు తోడ్పాటును అందించాలనుకున్నాం’ అని ఆయన అన్నారు.

For More News..

రేపే తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు