భలే మోసగాడు: ఒకే కంపెనీలో డబుల్ పేరోల్స్.. హైటెక్ ప్లాన్‌‌తో రెండు జీతాలు

భలే మోసగాడు: ఒకే కంపెనీలో డబుల్ పేరోల్స్.. హైటెక్ ప్లాన్‌‌తో రెండు జీతాలు

గ్రేటర్ నోయిడా: ఒక ఉద్యోగి తాను పని చేస్తున్న కంపెనీకే మోసం చేశాడు. దురాశతో కంపెనీని మోసం చేయాలని చూసి దొరికిపోయాడు. వివరాలు.. 25 ఏళ్ల రామ్ కుమార్ దాస్ అనే వ్యక్తి రెండేళ్ల కింద ఓ కాంట్రాక్టర్ ద్వారా గ్రేటర్ నోయిడాలోని మిందా కార్పొరేషన్స్ లిమిటెడ్‌‌లో ఉద్యోగంలో చేరాడు. అదే కంపెనీలో గతేడాది జూన్‌‌లో మరో కాంట్రాక్టర్ సాయంతో సీక్రెట్‌‌గా ఇంకో ఉద్యోగంలో ఎన్‌‌రోల్ చేయించుకున్నాడు. దీంతో డబుల్ పేరోల్స్‌‌పై ఏడాది పాటు రెండు జీతాలు అందుకున్నాడు. ఈ మోసం బయటపడటంతో మిందా కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

‘ఈ ఏడాది మార్చిలో కరోనా ప్రోటోకాల్స్ వల్ల బయోమెట్రిక్ అటెండెన్స్‌‌ను కార్డ్ సిస్టమ్‌‌తో మార్చాం. అనుమానితుడు ఇద్దరు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రెండు కార్డులను తీసుకున్నాడు. వీటితో రెండు వేర్వేరు మిషన్లలో అటెండెన్స్‌‌ ఇచ్చేవాడు. కార్డు సిస్టమ్ తర్వాత మరింత సేఫ్టీ కోసం ఫేస్ సెక్యూరిటీ డిటెక్టర్‌‌ను ప్రవేశ పెట్టాం’ అని మిందా సంస్థ అసిస్టెంట్ మేనేజర్ నిరంకార్ సింగ్ తెలిపారు. ఈ కేసును విచారిస్తున్న ఎకోటెక్ పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ భువనేశ్ కుమార్ తదుపరి విషయాలు వెల్లడించారు. ‘అనుమానిత వ్యక్తి రెండో కాంట్రాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఫేస్ డిటెక్టర్‌‌లో అతడి మోసం ఫొటో ద్వారా బయటపడింది. డేటాబేస్‌‌లో అప్పటికే అతడి ఫొటో ఉండటంతో గుర్తించడం సులువైంది. దీంతో సదరు కాంట్రాక్టర్ కంపెనీ మేనేజ్‌‌మెంట్‌‌ను అప్రమత్తం చేశారు. కంపెనీ కంప్లయింట్ ఇవ్వడంతో అనుమానితుడిపై సెక్షన్ 420 ప్రకారం కేసు నమోదు చేశాం’ అని భువనేశ్ చెప్పారు.