
కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపు
జగిత్యాల/జగిత్యాల క్రైం, వెలుగు: ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఎస్సై తనపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నాడంటూ భార్యాపిల్లలతో కలిసి ఓ వ్యక్తి ఆందోళనకు దిగాడు. పెట్రోల్ డబ్బాతో ఎస్పీ ఆఫీస్ కు వెళ్లే ప్రయత్నం చేసిన అతడిని పోలీసులు అడ్డుకున్నారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీ దేవిపల్లి గ్రామానికి చెందిన గుర్రం రాజి రెడ్డి 2017లో యూరప్ ఏజెంట్ గా పని చేస్తున్న చక్క జనార్థన్ కు సబ్ ఏజెంట్ గా చేశాడు. ఆ సమయంలో యూరప్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 10 మంది వద్ద రూ. 36 లక్షలు తీసుకుని అజర్ బైజన్ పంపించామని తెలిపారు. ఉద్యోగాలు రాకపోవడం తో తిరిగి స్వదేశానికి వచ్చిన అనంతరం పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేసుకుని డబ్బులు తిరిగి చెల్లించినట్లు చెప్పారు. ఆ మేరకు అగ్రిమెంట్కూడా రాసుకున్నట్లు తెలిపారు. మూడేళ్ల తర్వాత ఇటీవల జూన్6న కొడిమ్యాల పోలీస్ స్టేషన్ కు పిలిచి తనపై బాధితుల్లో ఒకరైన టీఆర్ఎస్ నాయకులు మల్లేశం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారన్నారు.
బాధితులతో ఒప్పందమైందని, పేపర్లు తీసుకువస్తామని చెప్పినా ఉద్దేశపూర్వకంగా చీటింగ్, ఇమిగ్రేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దుర్భాషలాడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గంగాధర మండలం లక్ష్మిదేవిపల్లి లో ప్రభుత్వ స్థలం లో శ్మశానం ఏర్పాటు చేసేందుకు తీర్మానించారని, అక్కడి రైతులు వ్యవసాయ భూముల ధర పడిపోతుందని ఎమ్మెల్యే రవిశంకర్ ను కోరడంతో మరోచోట ఏర్పాటు చేయాలని ఆయన స్థానిక ప్రజాపత్రినిధులను ఆదేశించారన్నారు. ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించినట్లు రాజిరెడ్డి తెలిపారు. దీనికితోడు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కాకుండా కాంగ్రెస్కు సపోర్ట్చేశానని అన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పోలీసుల ద్వారా ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి భార్య లావణ్య, కొడుకు శివ, కూతురు హన్సికలతో వచ్చారు. తనపై అక్రమ కేసులు ఎత్తివేసి, న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ డబ్బా తీసుకువచ్చారు. రాజిరెడ్డిని ఆఫీస్కు పిలిపించి మాట్లాడిన ఎస్పీ సింధు శర్మ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.