
పాములను చూస్తే ఎవరైనా భయపడతారు. కానీ ఇటీవల వాటిని పట్టుకోవడం పాములతో పరాచకాలాడటం ఆ వీడియోలోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎక్కువైపోయింది. అయితే ఎంత సరదా ఉన్నా పాములతో మితిమీరిన వేషాలేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇలాంటి ఘటనే కర్నాటకలో జరిగింది. పామును పట్టుకునేందుకు వచ్చిన స్నేక్ రెస్క్యూ టీం మెంబర్ దాన్ని ముద్దుపెట్టుకోబోయి హాస్పిటల్ బెడ్డెక్కాడు.
కర్నాటకలో శివమొగ్గ జిల్లాలోని బొమ్మనకట్టె ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి పాము వచ్చింది. దీంతో భయపడిపోయిన ఆ ఇంటి సభ్యులు స్నేక్ రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన ఆ టీం సభ్యుడు ఒడుపుగా ఆ పామును పట్టుకున్నాడు. అయితే అలా పట్టుకున్న పామును డబ్బాలో బంధించకుండా కాసేపు ఆటలాడాడు. పడగ విప్పిన ఆ నాగుపాముకు ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. అప్పటికే భయంతో ఉన్న ఆ పాము ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతని పెదవిపై కాటేసింది. ఈ హఠాత్పరిణామంతో భయపడిపోయిన సదరు వ్యక్తి ఆ పామును వదిలేయడంతో అది అక్కడి నుంచి పారిపోయింది. స్థానికులు ఆ రెస్క్యూ టీం మెంబర్ ను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి 30సెకన్ల నిడివి గల వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. స్నేక్ రెస్క్యూ టీం సభ్యుడు చేసిన పనిపై ఇంటర్నెట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పామును ముద్దాడాల్సిన అవసరమేముందని ఒకరు ప్రశ్నించగా.. ఇప్పటి వరకు ఇంత గొప్ప లిప్ లాక్ చూడలేదని మరికొందరు సటైర్లు వేస్తున్నరు.