
- అడవినే అమ్మేసిండు
- 600 ఎకరాలకు బాండ్లు రాసిచ్చిన వ్యక్తి
- కొని మోసపోయిన బాధితులు
జయశంకర్ భూపాలపల్లి/మల్హర్, వెలుగు: తమ పెద్దల నుంచి ఇనామ్గా సంక్రమించిందంటూ ఏకంగా 600 ఎకరాల అటవీ భూములను ఓ వ్యక్తి దర్జాగా అమ్మేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం శివారులోని 41 సర్వే నంబర్లో 1,298.03 ఎకరాల అటవీ భూమి ఉంది. చిట్యాల మండలం చల్లగిరిగకు చెందిన ఒక వ్యక్తి తనకు ఈ భూములు దానం(హిబా) వచ్చాయని నమ్మించి 12 మందికి అమ్మేశాడు. వారికి నోటరీ ద్వారా అగ్రిమెంట్ చేసి ఇచ్చాడు. వాస్తవానికి ఈ భూములు అటవీ శాఖకు చెందినవి. కొందరు గిరిజనులు ఈ భూముల్లో పోడు చేసుకునే ప్రయత్నం చేయగా ఆఫీసర్లు అడ్డుకుని కేసులు పెట్టారు. తమకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులు కోరగా దట్టమైన అడవులు ఉన్నందున పట్టాలివ్వడానికి నిరాకరించారు. గిరిజనులు ఒక్క ఎకరం పోడు చేసుకున్నా ఇబ్బందులు పెట్టే ఆఫీసర్లు భారీ ఎత్తున ఫారెస్ట్ భూములను అమ్ముకుంటున్నా మౌనం వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రాంతంతో సంబంధం లేని 12 మంది దళారులు సర్వేనంబర్ 41లోని భూమి తమకు పట్టా అయిందని, ఆ భూముల్లోకి ఎవరూ రావద్దని ప్రజలను బెదిరిస్తున్నారని నాచారం సర్పంచ్ కాసాని రామయ్య జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
భూమి అటవీశాఖదే..
నాచారంలోని సర్వే నంబర్ 41లో 1,298.03 ఎకరాల భూమి అటవీశాఖదే. ఈ భూమి ధరణిలో కూడా మహాసూర(అడవి)గానే నమోదు చేశారు. ఎవరు అడవులను నరికినా కఠిన చర్యలు తీసుకుంటాం.
- శ్రీనివాస్, మల్హర్ తహసీల్దార్