ప్రియుడితో కలిసి రెండేండ్ల కూతురిని చంపిన తల్లి.. మెదక్‌‌ జిల్లా శివ్వంపేట మండలంలో ఘటన

ప్రియుడితో కలిసి రెండేండ్ల కూతురిని చంపిన తల్లి.. మెదక్‌‌ జిల్లా శివ్వంపేట మండలంలో ఘటన
  • నాలుగు నెలల కింద  చిన్నారిని తీసుకొని ప్రియుడితో ఏపీకి వెళ్లిన మహిళ
  • కూతురిని చంపి బైక్‌‌పై స్వగ్రామానికి వచ్చి పూడ్చివేత    

శివ్వంపేట, వెలుగు : ఓ మహిళ తన రెండేండ్ల కూతురిని తీసుకొని ప్రియుడితో కలిసి ఏపీకి పారిపోయింది. అక్కడ కూతురిని హత్య చేసిన అనంతరం డెడ్‌‌బాడీని బైక్‌‌పై స్వగ్రామానికి తీసుకొచ్చి పూడ్చివేసి తిరిగి వెళ్లిపోయింది. చివరకు పోలీసులు ఇద్దరినీ పట్టుకోవడంతో చిన్నారి హత్య విషయం బయటపడింది. 

మెదక్‌‌ జిల్లా శివ్వంపేట మండలంలో జరిగిన ఘటన వివరాలను తూప్రాన్‌‌ డీఎస్పీ నరేందర్‌‌గౌడ్‌‌ శుక్రవారం వెల్లడించారు. శభాష్‌‌పల్లికి చెందిన బంటు మమతకు రాయపోల్‌‌ మండలం వడ్డేపల్లికి చెందిన భాస్కర్‌‌తో ఐదేండ్ల కింద పెండ్లి జరిగింది. వీరికి కొడుకు చరణ్‌‌, కూతురు తనుశ్రీ (2) ఉన్నారు. మమతకు ఏడాది కింద శభాష్‌‌పల్లికి చెందిన ఫయాజ్‌‌తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఫయాజ్‌‌, మమత గత మార్చిలో ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.

 భాస్కర్‌‌ ఫిర్యాదుతో మిస్సింగ్‌‌ కేసు నమోదు చేసిన రాయపోల్‌‌ పోలీసులు.. ఇద్దరూ హైదరాబాద్‌‌లో ఉన్నట్లు గుర్తించి గ్రామానికి తీసుకొచ్చారు. పెద్దల సమక్షంలో మమతకు నచ్చజెప్పి తిరిగి అత్తారింటికి పంపించారు. కాగా.. మే 21న శభాష్‌‌పల్లిలో ఉన్న మమత తన కూతురు తనుశ్రీని తీసుకొని మరోసారి ఫయాజ్‌‌తో వెళ్లిపోయింది. మమత తండ్రి ఫిర్యాదుతో శివ్వంపేట పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వారు ఏపీలోని నర్సరావుపేటలో ఉన్నట్లు గుర్తించి గురువారం ఇద్దరినీ శివ్వంపేటకు తీసుకొచ్చి చిన్నారి గురించి అడగడంతో హత్య విషయం బయటపడింది. 

జూన్‌‌ 7న తనుశ్రీని గొంతు నులిమి చంపి, బైక్‌‌పై నరసరావుపేట నుంచి శభాష్‌‌పల్లికి తీసుకొచ్చి గ్రామ శివారులోని కాల్వ పక్కన పూడ్చివేసి తిరిగి వెళ్లిపోయినట్లు చెప్పారు. వారిచ్చిన సమాచారంతో శుక్రవారం కాల్వ పక్కన తవ్వి చిన్నారి డెడ్‌‌బాడీని బయటకు తీసి అక్కడే పోస్ట్‌‌మార్టం నిర్వహించినట్లు డీఎస్పీ నరేందర్‌‌గౌడ్‌‌, సీఐ రంగ కృష్ణ, ఎస్సై మధుకర్‌‌రెడ్డి తెలిపారు.