మంచిర్యాలలో బీజేపీ జెండా ఎగురవేస్తాం : ఎంపీ గొడం నగేశ్

మంచిర్యాలలో బీజేపీ జెండా ఎగురవేస్తాం : ఎంపీ గొడం నగేశ్
  • ఎంపీ గొడం నగేశ్ 

మంచిర్యాల, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన వెరబెల్లి రఘునాథ్ రావు శుక్రవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా మంచిర్యాలలోని లో ఫంక్షన్ హాల్​లో అభినందన సభ నిర్వహించారు. ఆదిలాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, హరీశ్​బాబుతో కలిసి ఎంపీ చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా నుంచి రఘునాథ్ రావుకు స్టేట్ కమిటీలో స్థానం దక్కడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందన్నారు.

లోకల్ బాడీ ఎలక్షన్లకు భయపడుతున్న కాంగ్రెస్

తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించేం దుకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని పాయల్ శంకర్ విమర్శించారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. ఓటమి భయంతోనే లోకల్ బాడీస్ ఎన్నికలను వాయిదా వేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తల కృషితోనే రాష్ట్రంలో 8 ఎమ్మెల్యే, 8 ఎంపీ సీట్లలో పార్టీ గెలిచిందన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 

బీజేపీ కంచుకోట ఆదిలాబాద్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీకి కంచుకోటగా మారిందని రఘునాథ్ ​రావు అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటుతామని, ఉమ్మడి జిల్లాను కషాయమయం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీ సాధించేందుకు పోరాటం చేస్తానన్నారు. మంచిర్యాలలో 250 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ఐటీ పార్క్ పేరుతో కొత్త స్కీమ్ తీసుకొచ్చారని, మంచిర్యాలను అవినీతికి, గుండాయిజానికి అడ్డగా మార్చారని ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావుపై విమర్శలు గుప్పించారు. 

అంతకుముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇందారం గోదావరి బ్రిడ్జి వద్ద రఘునాథ్ ​రావుకు ఘనస్వాగతం పలికారు. సీసీసీ కార్నర్ నుంచి బైక్ ర్యాలీ చేపట్టి మంచిర్యాలకు చేరుకున్నారు. సభలో మాజీ ఎంపీ బి.వెంకటేశ్ నేత, గోమాసే శ్రీనివాస్, గోనె శ్యామ్ సుందర్ రావు, కొయ్యల ఏమాజీ, ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ధోనీ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.