లేబర్ టు జడ్జి.. కేరళ వాసి సక్సెస్​ స్టోరీ 

లేబర్ టు జడ్జి.. కేరళ వాసి సక్సెస్​ స్టోరీ 

బీడీలు చుట్టి.. రోజు కూలీగా పనిచేసిన ఓ వ్యక్తి .. ఏకంగా అమెరికాలో జడ్జి అయ్యాడు. అతడిపై ప్రతిష్ఠాత్మక ది వీక్​ మ్యాగజైన్​లో ఓ కథనం ప్రచురితమైంది. దీంతో అతడి పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నది. కేరళలోని కాసర్​ గోడ్ కు చెందిన సురేంద్రన్​ ఇటీవల అమెరికాలోని జుడిషియల్​ డిస్ట్రిక్​ కోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో అతడి జీవితంపై ది వీక్​ పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. సురేంద్రన్  బాల్యం అత్యంత దుర్భరంగా గడిచింది. కుటుంబసభ్యులంతా బీడీలు చుట్టి ఉపాధి పొందేవాళ్లు. దీంతో పదోతరగతిలోనే ఆయన చదువు మానేయాలని నిర్ణయం తీసుకున్నారు.  చదువుకు స్వస్థి చెప్పి బీడీలు చుట్టడం ప్రారంభించారు.  అనంతరం చదువుమీద ఆసక్తితో ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్​ తెచ్చుకున్నారు. ఆ టైంలో కూడా కళాశాలకు వెళ్లకుండా ఎక్కువ రోజులు బీడీలు మాత్రమే చుట్టేవారు. దీంతో ఆయనకు హాజరు శాతం తగ్గింది. అయినప్పటికీ ఆ సమయంలో నిర్వహించిన పరీక్షల్లో సురేంద్రన్​ టాపర్​ గా నిలిచాడు. దీంతో స్నేహితుల ప్రోద్బలంతో కాలీకట్​ గవర్నమెంట్​ లా కళాశాలలో ప్రవేశం పొంది న్యాయవిద్యను అభ్యసించారు. 1996లో లాయర్​ గా ప్రాక్టీస్​ సుప్రీంకోర్టులో పలు కేసులను వాదించారు.  2004లో శుభతో ఆయన వివాహమైంది. అనంతరం వీరు అమెరికాలోని హూస్టన్​ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అనంతరం అమెరికాలోని చట్టాల మీద ఆసక్తితో.. సురేంద్ర  అక్కడి యూనివర్సిటీ ఆఫ్​ హ్యూస్టన్ లో  ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని చట్టాలను అధ్యయనం చేశారు. 

ముందు ఓటమి.. తర్వాత గెలుపు

2020లో న్యాయమూర్తి పదవి కోసం జరిగిన ఎన్నికలో సురేంద్రన్​ ఓటమి పాలయ్యారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన సంచలన విజయం నమోదు చేశారు. సురేంద్రన్​ యాసను ఆయన ప్రత్యర్థి అవమానించారు. దీన్నే ఆయుధంగా చేసుకున్న సురేంద్రన్​ ప్రత్యర్థి యాసనే అంగీకరించలేని వ్యక్తి.. న్యాయం ఎలా చెప్పగలరంటూ ప్రచారం చేశారు. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో సంచలన విజయం సాధించారు. ప్రస్తుతం సురేంద్రన్​ న్యాయమూర్తి ఎన్నికవడంతో సోషల్​ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.