మన ఊరు మన బడి బిల్లులు రిలీజ్ చేయండి

మన ఊరు మన బడి  బిల్లులు రిలీజ్ చేయండి
  • డీఎస్ఈ ముందు కాంట్రాక్టర్ల ధర్నా 

హైదరాబాద్, వెలుగు: మన ఊరు మన బడి స్కీము కింద బడుల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్(డీఎస్ఈ) ముందు కాంట్రాక్టర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్​ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి బడుల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని చెప్పారు.

కానీ, రెండేండ్ల నుంచి బిల్లులు రిలీజ్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అప్పులు తీసుకొచ్చి పనులు నిర్వహించామని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.వెయ్యి కోట్ల దాకా బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే బిల్లులు రాకపోవడంతో పది మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. నిత్యం అధికారులు, కలెక్టర్లు చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు.  ప్రభుత్వం ఇప్పటికైనా బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు.