కుత్బుల్లాపూర్ బరిలో 200 మంది కార్మికులు

కుత్బుల్లాపూర్ బరిలో 200 మంది కార్మికులు
  • సమస్యను పరిష్కంచని అధికార పార్టీపై ఆగ్రహం 

జీడిమెట్ల, వెలుగు :  ఏండ్ల తరబడి పనిచేసిన కంపెనీ యాజమాన్యం సుమారు వెయ్యి మంది కార్మికులను నిర్ధాక్షిణ్యంగా బయటకు గెంటేసింది. దీంతో వెయ్యి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కార్మికులు తమకు అన్యాయం జరిగిందని  ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఇంటి అద్దెలు కట్టలేక.. వాహనాల ఈఎంఐలు, పిల్లల  ఫీజులు కట్టలేక నరకయాతన పడ్డారు.  

ఏ ప్రజా ప్రతినిధి, ఏ నాయకుడు పట్టించుకోలేదు.  తమ సమస్యను పట్టించుకోకపోవడంతో అధికార పార్టీపై నిరసన వ్యక్తం చేస్తూ  సుమారు 200 మంది కార్మికులు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇది కుత్బుల్లాపూర్​ నియోజకవర్గం జీడిమెట్ల ఇండస్ట్రియల్​ఏరియాలోని సూపర్​మ్యాక్స్ ప్రయివేట్​లిమిటెడ్​కంపెనీకి చెందిన సుమారు వెయ్యి మంది కార్మికుల ఆవేదన.  దశాబ్ధాలకుపైగా పనిచేసినా పరిశ్రమ యాజమాన్యం తమకు పనిలేకుండా జీతాలు ఇవ్వకపోవడంపై  తమ బాధను వ్యక్తపరుస్తూ రిలే నిరాహార దీక్షలు చేశారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతిపక్షనాయకులు అందరూ వచ్చి హామీలు ఇచ్చి వెళ్లారు. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.  కంపెనీ మూసివేసి ఏడాది గడిచినా ఇప్పటికీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో  అధికార పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్​లు వేసి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు.

దీంతో  మంగళవారం కార్మికులు పెద్ద ఎత్తున కుత్బుల్లాపూర్ ​రిటర్నింగ్​ కార్యాలయానికి వచ్చి 36 నామినేషన్​ పత్రాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొత్తం 200 మంది నామినేషన్​ వేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఈ విధంగానైనా తమ నిరసన రాష్ట్ర పెద్దలకు చేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.