పదసాహిత్యానికి ఆయువుపట్టు తెలంగాణ

పదసాహిత్యానికి ఆయువుపట్టు తెలంగాణ

కవిత్వం ఏదైనా ‘పదసాహిత్యమే’ దానికి పునాదిగా ఉంది. వేదాల్లోని ఋక్కులు, సామములు, సూక్తాలు గానయోగ్యమైనవే. ఇవన్నీ మొదట పాడుకున్నవే. వాటికి ఛందోనియమాలు అనే ‘టూల్’ ఏర్పడిన తర్వాత ఎక్కువ జాగ్రత్తలు మొదలయ్యాయి. వాల్మీకి మహర్షి లవకుశుల ‘గానం’తోనే శ్రీమద్రామాయణం మొదలుపెట్టాడు. మహాభారతంలో ‘గీత’ అంటేనే పాడబడిందని అర్థం. భాగవతంలోని భ్రమర గీతాలు, పురాణ సాహిత్యంలోని ఎన్నో ‘గీత’లు పాడబడినవే. ఇలా గానయోగ్యమైన సాహిత్య సృష్టి ద్వారా మన ప్రాచీన వాఙ్మయం అంతా రక్షింపబడింది.  మన సంస్కృతికి గుర్తింపు కలిగించేందుకు ప్రచారమాధ్యమాలుగా ఉపయోగపడ్డాయి. 

జైన, బౌద్ధాలు సంస్కృతాన్ని వదలిపెట్టి మతప్రచారం కొరకు పాళీ– ప్రాకృతం లాంటి భాషల్ని ఆశ్రయించాయి. ఆ క్రమంలో జైనుల త్రిషష్టి శలాక పురుష వృత్తాంతం, బౌద్ధుల జాతక కథలు వచ్చాయి. ఈ వరుసలో దేశభాషల ప్రాధాన్యత పెరిగింది. తమిళంలో పెరియపురాణం, కన్నడంలో అరవత్తు మూవురు శివ భక్త కతగళు వంటి గ్రంథాలు వచ్చాయి. తెలుగు ప్రాంతంలో మాత్రం చాళుక్యుల కాలం మార్గ ఛందస్సు రాజ్యం ఏలగా.. చాళుక్యులు దాన్ని పక్కకు తప్పించి దేశీ ఛందస్సుకు మార్గం వేశారు. 

అయితే.. తమిళులు అంతకన్నా ముందే పద సాహిత్యం కాపాడుకున్నారు. ముఖ్యంగా స్త్రీల లాలిపాటలు, దంపుళ్ల పాటలు తమిళ భాష ప్రాచీనతను నిలబెట్టాయి. తెలుగు ప్రాంతంలో బసవేశ్వరుడి తర్వాత పాల్కురికి సోమనాథుడు అంత ప్రభావం చూపాడు. అప్పటివరకు ఇక్కడ ఎలాంటి పద సాహిత్యం ఉందో మల్లికార్జున పండితుడు తన పండితారాధ్య చరిత్రలో వెలనాటి చోళుడి సభకు వెళ్తుంటే భక్తుల గీతాలను గురించి చెప్పుకొచ్చాడు. 

‘‘మదినుబ్బిసంసారమాయాస్తవంబు పదములు తుమ్మెద పదముల్ 
ప్రభాత పదములు పర్వతపదములా నంద పదములు
శంకర పదములు నివాళి పదములు వాలేశు పదములు గొచ్చి పదములు
వెన్నెల పదములు సంజవర్ణన మరి గణ వర్ణన పదములర్ణవఘోష ఘూరిల్లు చుండఁ బాడచు ఆడుచు పరమహర్షమును గూడి సద్భక్తి సంకులమేగువేర”

అంటూ ఎన్నో రకాల పదాలను పేర్కొన్నాడు. అట్లానే తన కవిత్వాన్ని పద–- శబ్దంతో ముడిపెట్టి ద్వి–పద అంటూ రెండు పాదాల్లో అల్పాక్షరాల్లో అనల్పభావన అందిస్తూ రెండు గొప్ప కావ్యాలను దేశీ ఛందస్సు ద్విపదలో అందించాడు. ఆ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో పంటమార్పిళ్లలో, కోతల్లో, నాట్లలో పాడుకొనేందుకు గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రచించి పనీ-–పాటకు ఆనాడే పట్టంగట్టాడు. అలాగే సంతాపూర్ (నేటి రంగారెడ్డి జిల్లా)-కు చెందిన సింహగిరి కృష్ణమాచార్య వచనాలు భక్తి– సామాజిక దృష్టి -– దేశీ సాహిత్యమైన ‘వచనం’ అన్న కొత్తప్రక్రియకు తెలంగాణలో బీజాలాపనం జరిగింది.

ఇలా ‘పదం’ అన్నది ఈ గడ్డపై అంకురార్పణ జరిగి అది అనేక రూపాలను సంతరించుకొన్నది. పదమే.. వచనం – పాట– పద్యం– -గీతం–గేయం – ఏలలు– దర్యులు, మంగళారతులు, ఉయ్యాలలు, మేల్కొల్పులు– ఝుణుకులు – చూర్ణికలు, జక్కుల రేకులు – చందమామ పదాలు – మంజరులు – కందార్థాలు - తాళగంధి – మానసబోధలు– తత్వాలు – కీర్తనలు - సంకీర్తనలు – భజనలు. ఇలా ఎన్నో ప్రక్రియలుగా మార్పు చెందింది. స్థూలంగా జానపద విజ్ఞానవేత్తలు శ్రామిక- పారమార్థిక – కాటుంబిక గేయాలుగా విభజించారు. అయితే దైవారాధన – అంతరార్థం అన్న రెండు లక్ష్యాల సాధనకు కీర్తన – తత్వం అన్న రెండు ప్రక్రియలు తెలంగాణలో అజరామరంగా ఉన్నాయి. నా పరిశోధనలోనే తెలంగాణలో సుమారు 400 మందికిపైగా వాగ్గేయకారులు లభించారు. వీళ్లలో చాలామంది (సుమారు 350)  ఏ సాహిత్య చరిత్రలో చోటు దక్కనివారు. ఎక్కువమంది అట్టడుగు వర్గాల నుంచి వచ్చినవాళ్లే.

శబ్దం నాదంతో కలిస్తే సంగీతంగా, శబ్దం అర్థంతో కలిస్తే సంకీర్తనగా శబ్దం మనస్సుతో కలిస్తే తత్వగీతంగా ప్రచురితం అయ్యాయి. పరమశివుడి ఢమరుకం నుంచి వర్ణ సమామ్నాయం పుట్టినందుకు శైవులు మతప్రచారానికి దేశీ సాహిత్యం స్వీకరించగా, శ్రీకృష్ణుని వేణువు నుండి రాగ ప్రపంచం పుట్టినందున వైష్ణవులు సంగీతం ఆధారం చేసుకున్నారు. అలాగే నిరక్షరాస్యులైన భక్తులు తమకున్న జ్ఞానాన్ని కవిత్వీకరించి సరళ సంగీత సాహిత్యాలతో కీర్తనలు-, తత్వాలు విస్తృతంగా రచించి ప్రజల్లో భక్తి, నైతికత, కుల తత్వనిర్మూలన, ఆధ్యాత్మిక ప్రచారం చేశారు. ఇదంతా దేశీ సాహిత్యంగా చెప్పవచ్చు.

సంకీర్తన అనగా భగవంతుణ్ణి కీర్తించడం. దేవుడి రూప– -గుణ – లీలావర్ణనలు. ఇందులో సరళమైన సంగీతం, పంచోపచార– షోడశోపచార కీర్తనలు, ఉత్సవ కీర్తనలు, ఏకాత్మభావన, నవవిధ భక్తి, పౌరాణిక భావాల అనుకరణ సంకీర్తల్లో ప్రధానం. తత్వంలో కులనిరసన, సరళభాష, దేశీ పదాల గుభాళింపు. గురువు – నిర్గుణబ్రహ్మోపాసన, మార్మిక భావాలలో సాంఖ్య తత్వవిచారణ, ప్రాకృతిక, సాంసారిక ఉదాహరణలు ప్రధానంగా చోటు చేసుకున్నాయి. తెలంగాణ పదసాహిత్యంలో ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తాయి. రామదాసు భజనలు సుమారు 137 దొరుకుతున్నాయి. అవన్నీ ప్రామాణిక భాషలో రామభక్తిమయం. రాకమచర్ల వెంకటదాసు 500 కీర్తనలు గానయోగ్యమై భక్తి రసాన్ని రంజింపజేస్తాయి. 

120 ఏళ్ల క్రితం తొలి దళిత కవి మాదిగ మహాయోగిగా పేరొందిన దున్న ఇద్దాసు, రాజోలు సంస్థానం పాలించిన ముష్టిపల్లి వెంకట భూపాలుడు రాసిన 3,476 సంకీర్తనలు ఇప్పటికీ హైదరాబాద్ ప్రాచ్య లిఖిత భాండాగారం తాళపత్రాల్లో మూలుగుతూనే ఉన్నాయి. ఈగ బుచ్చిదాసు వంటి క్షేత్ర సంకీర్తన కవులు, శేషమ్మ, జాలమాంబ, తూడి దేవమాంబ, మనసాని లక్ష్మమ్మ వంటి స్త్రీ వాగ్గేయకారులు, మల్కిదాసు, ఖ్వాజా అహమదోద్దీన్, సయ్యద్ గులాం మహ్మద్, అఫ్జల్ చిస్తీ వంటి ముస్లిం వాగ్గేయకారులు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ పదాలను గుప్పించిన వేపూరు హనుమద్దాసు ఉర్దూలో కూడా కీర్తనలు రాశారు. పరమహంస బ్రహ్మానంద రాసిన బ్రహ్మానంద భజనమాల తెలంగాణలో ప్రసిద్ధం.

భద్రాచల రామదాసు, నారదగిరి కవులు కొత్త కొత్త హిందుస్థానీ రాగాలను ఇక్కడి ప్రజలకు పరిచయం చేస్తే.. పల్లా నారాయణాధ్వరి వంటి వారి కృతులు తెలంగాణ ప్రజలకు దక్కిన సంగీత వారసత్యం. శివరామదీక్షితుల అచలమార్గంలో కందార్థాలు, తత్వాలు లెక్కలేనన్ని వచ్చాయి. ఇలా పదసాహిత్యం తెలంగాణ ప్రాంతానికి పట్టాభిషేకం చేసిందని చెప్పవచ్చు. 

దేవా విష్ణు భక్తి లేని విద్వాంసుని కంటె హరి కీర్తనము సేయినతండె కులజుడు శ్వపచుండైననేమి ఏ వర్ణంబైననేమి 
ద్విజుని కంటె నతండు  కులజుండు
దృష్టి  జూడగా విద్వజ్జన దివ్య భూషణము 
సింహగిరి దలంచిన నాతడే కులజుడు

- సింహగిరి కృష్ణమాచార్యులు
- డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పి. భాస్కరయోగి
సోషల్​, పొలిటికల్​ ఎనలిస్ట్​