లింక్ కెనాల్ తవ్వకాలను నిలిపివేయాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

లింక్ కెనాల్ తవ్వకాలను నిలిపివేయాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా గార్ల మండలంలోని మున్నేరు, పాలేరు లింక్ కెనాల్ ను రద్దుచేసి పాత మున్నేరు ప్రాజెక్టుని పునరుద్ధరించాలని కోరుతూ ఆదివారం గార్ల మండలం అఖిలపక్ష కమిటీ నాయకులు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యను కలసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 మీటర్ల లోతుతో కాలువను తవ్వడంతో గార్ల మండలంలోని సుమారు 300 ఎకరాల్లో రైతులు భూములను కోల్పోవడంతో పాటుగా 30 చెరువులు, కుంటలకు నీరు చేరుకునే పరిస్థితి ఉండదన్నారు.

తక్షణం ప్రభుత్వం ప్రతిపాదనను విరమించుకుని గతంలో వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి హయాంలో సాంక్షన్​చేసిన పాత మున్నేరు ప్రాజెక్ట్​ను ముందుకు తీసుకుపోవాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి రైతుల సమస్యలను తీసుకువెళ్లామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు జీ.లక్ష్మణ్ నాయక్, కందునూరి శ్రీనివాస్, జడ సత్యనారాయణ, కట్టెబోయిన శ్రీనివాస్, శక్రునాయక్, గౌని ఐలయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు.