- ముగ్గురి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
రామాయంపేట, వెలుగు: గుప్త నిధులు బయటకు తీస్తామని నమ్మించి, డబ్బులతో పారిపోయిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ వెంకటరాజాగౌడ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. సిరిసిల్లకు చెందిన కదకంచి రాజారాం, రాజేశ్, సద్దుల అశోక్ జాతకం చెబుతామంటూ రామాయంపేట మండలం కాట్రియాల పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారు.
ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గుప్త నిధులు బయటకు తీస్తామని నమ్మించి రూ.80 వేల వరకు ఖర్చు చేయించగా మరో రూ.4.20 లక్షలు తీసుకుని పత్తా లేకుండా వెళ్లిపోయారు. దీంతో మోసపోయాయని గ్రహించిన బాధితుడు ఈనెల 31న పీఎస్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.4 లక్షల 20 వేలు రికవరీ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.
