కామారెడ్డి, వెలుగు : ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని పలు రాజకీయ పార్టీల నాయకులు అభ్యంతరాలను వెలిబుచ్చారు. సోమవారం జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల లీడర్లతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ నెల 1న మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ప్రకటించిన ఓటరు లిస్టులు సవరించాల్సి ఉందన్నారు. మున్సిపాలిటీల్లోని ఆయా వార్డుల్లో కొన్ని తొలగించాల్సి ఉందని, కొన్ని వార్డుల్లో తక్కువ ఓటర్లు, కొన్ని చోట్ల ఎక్కువ ఓటర్లను చేర్చారని ఆరోపించారు. దీనిపై పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు తెలిపారు.
బోధన్ మున్సిపల్ ఆఫీస్‌లో...
బోధన్ : బోధన్ పట్టణం ఓటరు లిస్టులో దొంగ ఓట్లను తొలగించాలని రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం బోధన్ మున్సిపల్ ఆఫీస్‌లో ఓటరు లిస్టుపై ఆయా పార్టీల లీడర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ ఓటరు లిస్టులో చాలా తప్పులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఉన్న లిస్ట్‌నే విడుదల చేశారని ఆరోపించారు.
ఒకే ఇంటిపై సంబంధంలేని వ్యక్తుల పేర్లతో ఓట్లు నమోదు చేశారని, ఒక కాలనీలోని ఓటర్లను మరోకాలనీలో నమోదు చేశారని, చనిపోయిన వ్యక్తుల పేర్లను తొలగించలేదన్నారు. ఓటరు లిస్ట్‌ను సవరించకపోతే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఓటరు లిస్ట్ సవరణ చేయడం తమ పరిధిలో లేదని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ, మజ్లిస్, కమ్యూనిస్టు లీడర్లు పాల్గొన్నారు.
