- ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ యాదవ్
మెదక్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుకు అండగా ఉంటుందని సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ యాదవ్ అన్నారు. మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఎన్నికలు సోమవారం మెదక్ పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో జరిగాయి. కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ సర్పంచుల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ఫోరం జిల్లా ఫోరానికి చేదోదు వాదోడుగా ఉంటుందన్నారు. ఏ సమస్య ఉన్నా జిల్లా ఫోరం ద్వారా తమ దృష్టికి తీసుకు వస్తే ప్రభుత్వ స్థాయిలో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తోందన్నారు. అభివృద్ధితోపాటు, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సర్పంచుకు సూచించారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అర్హులకు అందేలా సర్పంచులు చూడాలన్నారు.
జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా చిన్నశంకరంపేట మండలం జంగరాయి సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్సుహాసిని రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గౌడ్, పార్టీ జిల్లా నాయకులు మహిపాల్ రెడ్డి, సుప్రభాత రావు, రమేశ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
