ఆర్టీసీలో సీసీఎస్ పైసలిస్తలేరు..సొంతానికి వాడుకుంటున్నరు

ఆర్టీసీలో సీసీఎస్ పైసలిస్తలేరు..సొంతానికి వాడుకుంటున్నరు
  • ఇబ్బందులు పడుతున్న 15 వేల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్
  • రెండు నెలలుగావడ్డీలు చెల్లించని అధికారులు
  • ఫండ్స్ ను సొంతానికివాడేసుకున్న మేనేజ్ మెంట్
  • రూ.915 కోట్లు బకాయి పడ్డ ఆర్టీసీ 

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు దాచుకున్న డబ్బులను కూడా మేనేజ్ మెంట్ చెల్లించడం లేదు. వాళ్లు సీసీఎస్‌‌ (క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ)లో డిపాజిట్‌ చేసిన డబ్బులను సొంతానికి వాడేసుకుంది. వాటికి రెండు నెలలుగా వడ్డీ కూడా చెల్లించట్లేదు.  దీంతో చేతిలో చిల్లిగవ్వ లేక 15వేల మంది రిటైర్డ్‌‌ ఎంప్లాయీస్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ఇప్పటికే సీసీఎస్ లోన్ల కోసం ఉద్యోగులు పెట్టుకున్న 18వేల అప్లికేషన్లు పెండింగ్‌‌లో ఉన్నాయి.

వడ్డీ వస్తదని దాచుకుంటే…

ఆర్టీసీ కార్మికులు 1952లో సీసీఎస్‌‌ ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం 48వేల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. రిటైర్డ్‌‌, సభ్యత్వ డిపాజిట్ల కింద రూ.1100 కోట్లు, ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్ల కింద రూ.350 కోట్ల ఫండ్స్ ఉన్నాయి. లోన్ తీసుకున్న కార్మికుడు చనిపోతే ఆ మొత్తాన్ని మాఫీ చేస్తారు. ఆ సభ్యుడు కట్టిన డబ్బును తిరిగి చెల్లిస్తారు. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు. ఇతర బ్యాంకుల కంటే సీసీఎస్‌‌లో అసలుపై 2 శాతం ఎక్కువ వడ్డీ ఇస్తారనే రిటైర్డ్‌‌ అయిన ఎంప్లాయీస్‌‌ ఇందులో డిపాజిట్‌‌ చేస్తుంటారు. దీని ద్వారా నెలనెలా వచ్చే వడ్డీతో కాలం వెళ్లదీస్తుంటారు.

రెండు నెలలుగా వడ్డీ చెల్లిస్తలే..

ప్రస్తుతం సీసీఎస్‌‌లో 10వేలకు పైగా రిటైర్డ్‌‌ ఎంప్లాయీస్‌‌ డబ్బులను జమ చేశారు. వీళ్లు డిపాజిట్‌‌ చేసినవి రూ.250 కోట్ల వరకు ఉంటాయి. వీరికి నెలనెలా వడ్డీ చెల్లించేందుకు రూ.4.5 కోట్లు అవసరం అవుతాయి. ఆగస్టు వరకు మిత్తీలు సక్రమంగానే చెల్లించారు. సెప్టెంబర్‌‌, అక్టోబర్‌‌ వడ్డీలు మాత్రం పెండింగ్‌‌లో పెట్టారు. ఇటీవల 30మంది మాజీ ఉద్యోగులు మృతి చెందగా, వీరికి ఇవ్వాల్సిన డబ్బు ఇప్పటికీ అందలేదు.

లోన్లు కూడా ఇస్తలేరు..

రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రతినెలా జీతం నుంచి 7శాతాన్ని సీసీఎస్‌‌ వాటాగా పొదుపు చేస్తున్నారు. వాళ్లకు అవసరమైనప్పుడు లోన్లు తీసుకుంటారు. కానీ 2019 జనవరి నుంచి లోన్లు ఇస్తలేరు. ఇప్పటివరకు దాదాపు 18వేల లోన్‌ అప్లికేషన్లు పెండింగ్‌‌లో ఉన్నాయి సీసీఎస్‌‌కు చెందిన సుమారు రూ.765 కోట్లు ఆర్టీసీ తన సొంతానికి వాడుకుంది. రూ.150 కోట్ల వడ్డీతో కలిసి..  మొత్తం రూ.915 కోట్లకు చేరింది. సమ్మె టైంలో వెంటనే రూ.200 కోట్లు సీసీఎస్‌‌కు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా ఇప్పటికీ పైసా ఇవ్వలేదు. కరోనా టైంలో కూడా కనీసం లోన్లు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు సీసీఎస్‌‌ నుంచి వైదొలుగుతున్నారు.

రూ.400 కోట్లు వెంటనే ఇవ్వాలె

రిటైర్డ్‌‌ ఎంప్లాయీస్‌‌ డిపాజిట్‌‌ చేసిన డబ్బులను కూడా ఆర్టీసీ వాడేసుకుంది. జమ చేసిన డబ్బుల కింద ప్రతి నెలా మిత్తీ చెల్లిస్తాం. ఆ డబ్బులతోనే రిటైర్డ్‌‌ ఎంప్లాయీస్‌‌ పూట గడుస్తుంది. రెండు నెలలుగా డబ్బులు చెల్లిస్తలేం. కాళ్లు అరిగేలా సీసీఎస్‌‌ ఆఫీస్‌‌ చుట్టూ తిరుగుతున్నారు. ఏదో సమాధానం చెప్పి పంపిస్తున్నాం. వడ్డీతో కలిపి ఆర్టీసీ మొత్తం రూ.915 కోట్లు బకాయి ఉంది. ఇందులో రూ.400 కోట్లు అయినా చెల్లించాలి.

– మహేశ్, సీసీఎస్‌‌ సెక్రటరీ, వరంగల్‌ అర్బన్‌ జిల్లా