జీతం ఇట్లిచ్చి.. అట్ల తీసుకుంటున్రు

జీతం ఇట్లిచ్చి.. అట్ల తీసుకుంటున్రు
  • అఫిలియేషన్​ కోసం ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల జిమ్మిక్కులు 
  • సిబ్బందికి 3 నెలల జీతాలు​ క్లియర్ ​ఉంటేనే గుర్తింపు ఇస్తామన్న జేఎన్టీయూ
  • లెక్చరర్ల ఖాతాల్లో జీతం వేసి రిటర్న్ తీసుకుంటున్న మేనేజ్​మెంట్లు 
  • పట్టించుకోని జేఎన్టీయూ ఆఫీసర్లు.. ఆందోళనలో ఫ్యాకల్టీ 

హైదరాబాద్, వెలుగు: అబ్దుల్లాపూర్ మెట్​లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్​అక్కడే పని చేసే ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్​కు 3 నెలలుగా అకౌంట్​లో రూ.33 వేలు చొప్పున జీతం వేస్తోంది. అయితే డబ్బులు పడిన వెంటనే ఆ ఫ్యాకల్టీ ఆ మొత్తాన్ని మళ్లీ అదే కాలేజీకి చెందిన ఓ వ్యక్తికి రిటర్న్ పంపిస్తున్నారు. శాలరీ పేరుతోనే అతనికి రూ. 33 వేలు క్రెడిట్​అయినా.. ఆయన వాస్తవ నెల జీతం మాత్రం రూ.16 వేలే. ఇదొక్కటే కాదు.. అఫిలియేషన్​కోసం జేఎన్టీయూ పరిధిలో చాలా ఇంజనీరింగ్​ కాలేజీలు ఇదే తరహా జిమ్మిక్కులు చేస్తున్నాయి. సిబ్బందికి 3 నెలల శాలరీస్​ క్లియర్​ ఉంటేనే గుర్తింపు ఇస్తామని జేఎన్టీయూ ప్రకటించడంతో ఆయా ఇంజనీరింగ్​కాలేజీలు ఫ్యాకల్టీకి జీతాలు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ తీసుకుంటున్నాయి. స్టూడెంట్ల నుంచి ఫీజులు వసూలు చేస్తున్న మేనేజ్​మెంట్లు, కాలేజీల్లో పనిచేసే ఫ్యాకల్టీకి మాత్రం రూల్స్​ మేరకు నెలనెలా జీతాలివ్వడం లేదు. ప్రస్తుతం అఫిలియేషన్ టైమ్ కావడంతో ఆయా కాలేజీల నిర్వాకం ఇలా బయటపడుతోంది.

రాష్ట్రంలో 166 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. వీటిలో 30 వేలమంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. కరోనాతో గతేడాది మార్చి నుంచి మేనేజ్​మెంట్లు లెక్చరర్లకు జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ఆన్​లైన్​క్లాసులు నడుస్తున్నాయనే పేరుతో కొన్ని కాలేజీలు సగం జీతం ఇస్తుంటే, మరికొన్ని పెండింగ్​లో పెట్టాయి. పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో జీతాలివ్వడం లేదని సిబ్బంది సామూహిక ధర్నాలు చేశారు. వారిలో కొంతమంది ఏఐసీటీఈతో పాటు జేఎన్టీయూహెచ్​కు ఫిర్యాదు చేశారు. గవర్నర్​తమిళిసై సౌందరరాజన్​కు లేఖలు రాశారు. దీన్ని సీరియస్​గా తీసుకోవాలని గవర్నర్ ఆఫీసు నుంచి జేఎన్టీయూహెచ్​కు ఆదేశాలు అందాయి. దీంతో జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్లపై దృష్టి సారించింది. ఫ్యాకల్టీకి గత మూడునెలలు జీతాలిచ్చినట్టు బ్యాంక్ స్టేట్ మెంట్లు కూడా ఇవ్వాలని, వర్సిటీ పంపించిన ఫార్మాట్​లో సిబ్బంది వివరాలను పంపించాలని ప్రైవేటు కాలేజీలను ఆదేశించింది. దీంట్లో ఏమైనా తప్పులుంటే, తమదే బాధ్యతంటూ ప్రిన్సిపల్స్​నుంచి లేటర్లు తీసుకుంటోంది. కాలేజీల అఫిలియేషన్​కు సంబంధించిన ఫామ్​121లో ఈ వివరాలన్నీ పొందుపర్చాలని సూచించింది. దరఖాస్తులకు ఈ నెల17 వరకు గడువు ఇచ్చింది. జేఎన్టీయూహెచ్​ఆదేశాలతో సిబ్బందికి జీతాలు ఇయ్యడం తప్పనిసరి కావడంతో కొన్ని మేనేజ్​మెంట్లు తప్పుడు మార్గాలను ఎంచుకున్నాయి. అఫిలియేషన్​కు అవసరమైన ఏప్రిల్ నుంచి జులై వరకు ఫుల్ శాలరీస్​సిబ్బంది ఖాతాల్లో జమ చేస్తున్నాయి. అయితే జీతాలు ఇచ్చినట్టే ఇచ్చి, మళ్లీ వెనక్కి తీసుకుంటున్నాయి. కొన్ని కాలేజీలు గూగుల్​పే, ఫోన్​ పే ద్వారా రిటర్న్ తీసుకుంటుండగా, ఇంకొన్ని కాలేజీలు క్యాష్​, చెక్కుల రూపంలో సిబ్బంది నుంచి తీసుకుంటున్నాయి. అయితే చాలా కాలేజీల్లో నెలల తరబడి వేతనాలు పెండింగ్​లో ఉన్నాయని, వాటి గురించి వర్సిటీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫ్యాకల్టీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
తనిఖీలు అంతంతేనా? 
ఈనెల30 నుంచి ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. దీంతో 24 లోపే కాలేజీ ఫ్యాకల్టీ వివరాలను ఆన్​లైన్​లో పంపించాలని మేనేజ్​మెంట్లకు జేఎన్టీయూ ఆదేశాలిచ్చింది. ఈసారి కూడా కేవలం ఫ్యాకల్టీ వివరాల ఆధారంగానే అఫిలియేషన్ ఇవ్వాలని, వచ్చేనెలలో ఫిజికల్ గా తనిఖీలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో మేనేజ్​మెంట్లకు కొంత కలిసొచ్చినట్లయింది. అక్టోబర్ 25 వరకు కాలేజీల్లో ఫిజికల్ క్లాసులు ప్రారంభించుకోవచ్చని ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్​లో పేర్కొంది. దీనికి చాలా టైమ్​ఉన్నా, అధికారులు ముందుగా కాలేజీల్లో తనిఖీలు చేయకుండానే అడ్మిషన్ షెడ్యూల్​ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.


విచారణ జరిపించాలె
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల సిబ్బందికి జీతాలిచ్చి, మళ్లీ తిరిగి తీసుకోవడం దారుణం.  మెజార్టీ కాలేజీల్లో ఇదే నడుస్తోంది. దీనిపై జేఎన్టీయూహెచ్​ అధికారులు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు స్పందించి విచారణ జరిపించాలి. ఇలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి.                                                - సంతోష్​కుమార్, టీఎస్ టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు 


ఏఎఫ్​ఆర్సీ ద్వారా జీతాలియ్యాలె 
కాలేజీ మేనేజ్​మెంట్లు సిక్స్త్ పే ప్రకారం సిబ్బంది అకౌంట్​లో శాలరీ వేస్తూ మళ్లీ  తీసుకుంటున్నాయి. ఇదంతా జరుగుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. కరోనా పేరుతో18 నెలలుగా జీతాలు సరిగా ఇస్తలేరు. ఈ అక్రమాలను అరికట్టాలంటే ఏఎఫ్​ఆర్సీ ద్వారా ఎంప్లాయీస్​కు జీతాలియ్యాలె. 
                                                                                                                                                                                                    - బాలకృష్ణారెడ్డి, టీపీఐఈఏ రాష్ట్ర అధ్యక్షుడు