మనాలీకి వేలల్లో టూరిస్టులు: ఓ రేంజ్‌లో కరోనా మీమ్స్

మనాలీకి వేలల్లో టూరిస్టులు: ఓ రేంజ్‌లో కరోనా మీమ్స్
  • పీస్ కోసం పోతే.. ‘రెస్ట్ ఇన్‌ పీస్‌’ అంటున్న నెటిజన్లు

మనాలీ: కరోనా కేసులు తగ్గుతుండడంతో దేశంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను సడలిస్తున్నాయి. ఇదే బాటలో హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కర్ఫ్యూ ఆంక్షలను సడలించింది. దీంతో ఆ రాష్ట్రంలో ఉన్న మనాలీ, సిమ్లా, కుఫ్రీ, ముస్సోరీ వంటి ప్రాంతాలకు టూరిస్టుల తాకిడి పెరిగింది. ఢిల్లీ సహా నార్త్ ఇండియాలో చాలా చోట్ల హీట్ వేవ్స్‌తో జనం ఎండలు భరించలేక భారీ సంఖ్యలో ఈ హిల్ స్టేషన్స్‌లో చిల్ అవుదామని వెళ్తున్నారు. పైగా మరోవైపు కరోనా లాక్‌డౌన్లతో ఎటూ పోకుండా ఇండ్లలోనూ ఉండి విసిగిపోయిన చాలా మంది ‘పీస్ ఆఫ్ మైండ్’ కోసం అంటూ టూర్లు కట్టేస్తున్నారు. ఇలా రకరకాల కారణాలతో జనాలు మనాలీకి వేల సంఖ్యలో చేరుకుంటున్నారు. ఎంజాయ్ చేద్దామన్న మూడ్‌లో షికారుగా పోయినవాళ్లలో చాలా మంది కరోనా ప్రోటోకాల్‌ను మర్చిపోయారు. సోషల్ డిస్టెన్స్, మాస్క్ లాంటివి గాలికొదిలేశారు. కరోనా సెకండ్‌ వేవ్ ఇంకా అయిపోలేదని ఓ వైపు కేంద్రం హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇలా టూరిస్టులు భారీగా వస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించంతో నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. 

కరోనా థర్డ్ వేవ్‌కు ఇన్విటేషనా?
సరదా కోసం పోయి కరోనా థర్డ్ వేవ్‌ను ఆహ్వానిస్తున్నట్టుగా ఉందని నెటిజన్లు మీమ్స్‌ చేస్తున్నారు. పీస్ కోసం పోయే చాలా మందికి త్వరలో రెస్ట్ ఇన్ పీస్ తప్పదంటూ ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. మరో వ్యక్తి అయితే ఇన్విటేషన్ అందుకున్న కరోనా ఆనందంతో గంతులేస్తుందన్నట్టుగా ఫొటోలు పెట్టాడు. మరికొందరు ‘నేను మీకు జోక్‌గా అనిపిస్తున్నానా?’ అని కరోనా బాధపడుతున్నట్టు మీమ్స్ చేశారు. మరికొందరు వేర్వేరు కరోనా స్ట్రెయిన్స్ ఒకే చోట చేరినట్టుందంటూ కామెంట్లు చేస్తున్నారు.