- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులో ఘటన
గద్వాల, వెలుగు: బతికుండగానే చనిపోయారని చూపించి ఐదుగురికి దక్కాల్సిన భూమిని ఒక్క కూతురే కాజేసింది. దీంతో తమకు న్యాయం చేయాలని తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ జోషి కాళ్లు పట్టుకొని మహిళా రైతులు వేడుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి గ్రామానికి చెందిన బుచ్చన్న, మంగమ్మ భార్యాభర్తలు. వీరికి ఐదుగురు కూతుళ్లు కోటమ్మ, లక్ష్మీదేవి, వరలక్ష్మి, సుమిత్ర, సుజాత ఉన్నారు.
బుచ్చన్నకు గ్రామంలో 4 ఎకరాల 33 గుంటల భూమి ఉంది. 20 ఏళ్ల కింద బుచ్చన్న చనిపోగా, విరాసత్ కింద మంగమ్మ పేరిట రికార్డుల్లోకి వచ్చింది. కరోనా టైమ్లో మంగమ్మ చనిపోయింది. ఐదుగురు కూతుళ్లకు చెందాల్సిన భూమిని మంగమ్మకు తాను ఒక్కదాన్నే కూతురినని ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకొని పొలాన్ని మొత్తం మూడో కూతురు మూడు నెలల కింద తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంది.
విషయం తెలుసుకున్న మిగిలిన నలుగురు కూతుళ్లు సోమవారం మానవపాడు తహసీల్దార్ ఆఫీస్ కు వచ్చి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నెల రోజుల నుంచి తాము ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు.
