- మంచిర్యాలలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు
- రూ.7.8 లక్షల విలువైన బంగారు, వెండి అభరణాల స్వాధీనం
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన అన్నదమ్ములైన నిందితులను అరెస్ట్ చేసి రూ.7.8లక్షల విలువైన 311 గ్రాముల బంగారు, కిలో వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్ వివరాలు వెల్లడించారు.
మంచిర్యాల కాలేజ్ రోడ్గౌతమేశ్వరకాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ముదం నాగయ్య కుటుంబసభ్యులతో కలిసి ఏప్రిల్ 22న ఊరికి వెళ్లారు. మరుసటి రోజు వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువా లాకర్లు తెరచి అందులోని 378బంగారం, కిలో వెండి వస్తువులు, 1.50 లక్షల క్యాష్చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏసీపీ ప్రకాశ్ నేతృత్వంలో సీఐ ప్రమోద్‌రావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.
సోమవారం మంచిర్యాల బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అన్నదమ్ములైన రెడ్డిమల్ల ఆశిష్ శ్రీనివాస్, ఆకాశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన ఆశిష్ ప్రైవేటు ఉద్యోగి కాగా, ఆకాశ్ మైనింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడిన అన్నదమ్ములు దొంగతనాలకు పాల్పడుతున్నారని డీసీపీ తెలిపారు.
నిందితులపై చంద్రపూర్, నాగపూర్ ప్రాంతాల్లో 12కు పైగా కేసులు ఉన్నాయన్నారు. దోచుకున్న సొత్తులో 667 గ్రాముల బంగారాన్ని చంద్రపూర్‌లోని ముత్తూట్ ఫిన్‌కార్ప్‌లో తనఖా పెట్టి రూ.6.76 లక్షలు తీసుకున్నారు. భారీ చోరీని ఛేదించిన పోలీసులను అభినందించిన డీసీపీ వారికి రివార్డు అందజేశారు.
