ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యల పరిష్కారం : కలెక్టర్ కుమార్ దీపక్

ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యల పరిష్కారం : కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్(భీమారం)/నస్పూర్/చెన్నూరు, వెలుగు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ తో కలిసి మంగళవారం భీమారంలో పర్యటించారు. అర్కపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో జరుగుతున్న భూ భారతి సదస్సులో పాల్గొన్నారు. భూభారతి చట్టంతో రికార్డుల్లో తప్పుల సవరణతో పాటు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్​కు భూముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల పక్రియను స్పెషల్ ఆఫీసర్ వనజారెడ్డితో కలిసి పరిశీలించారు. 

మండల కేంద్రంలో నిర్మిస్తున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణ పనులు, అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మద్దికల్​లో వరి ధాన్యం కొనుగోలు సెంటర్​ను తనిఖీ చేశారు. చెన్నూర్ మండలం కత్తెరశాల, దుగ్నెపల్లి, అంగరాజ్పాల్లి, సుందరశాల, బాబురావుపేట, కిష్టంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలి 

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలని, టీచర్లతోనే సమాజ మార్పు సాధ్యమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం నస్పూర్ మండలం తీగల్​పహాడ్ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన సోషల్​టీచర్ల శిక్షణ కార్యక్రమానికి డీఈవో యాదయ్యతో కలిసి హాజరై మాట్లాడారు. ఉత్తమ, ఆదర్శనీయమైన సమాజ స్థాపనలో విద్యార్థులను సిద్ధం చేయాల్సిన గురుతర బాధ్యత టీచర్లదేనన్నారు.

 సామర్థ్యాల పెంపు కోసం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి టీచర్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమగ్ర శిక్ష సమన్వయకర్తలు చౌదరి, సత్యనారాయణమూర్తి, కోర్స్ డైరెక్టర్ జి. రామన్న, రిసోర్స్ పర్సర్స్, వివిధ మండలాలకు చెందిన సోషల్​ టీచర్లు పాల్గొన్నారు.