వర్షాలు పెరగకముందే ధాన్యాన్ని తరలించాలి : కలెక్టర్ ​కుమార్​ దీపక్​ 

వర్షాలు పెరగకముందే ధాన్యాన్ని తరలించాలి : కలెక్టర్ ​కుమార్​ దీపక్​ 

నస్పూర్/బెల్లంపల్లి రూరల్, వెలుగు: వర్షాలు పెరగకముందే వరి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని మంచిర్యాల కలెక్టర్ ​కుమార్​ దీపక్ కొనుగోలు కేంద్రాల ఇన్​చార్జీలను ఆదేశించారు. వేమనపల్లితోపాటు మండలంలోని దస్నాపూర్, గొర్లపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. కేంద్రాల్లో వడ్లు ఇంకా కుప్పలుగా ఉండడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని ఎందుకు తరలించడం లేదని ప్రశ్నించారు. సరిపడా లారీలను పంపి ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా ఏర్పటు చేస్తానన్నారు. తహసీల్దార్​సంధ్యారాణి, ఆర్ఐ ఖలీక్ ఉన్నారు.  

రైస్ మిల్లర్లు నిర్దేశిత లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి 

రైస్ మిల్లర్లు సీఎంఆర్ డెలివరీ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతీలాల్​తో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సీఎంఆర్ డెలివరీ, 2022–23 రబీ ధాన్యం వేలం అంశాలపై రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 2024–25 ఖరీఫ్ సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలని, పెండింగ్ ఏసీకే లక్ష్యాలను సైతం పూర్తిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, ఆర్ఐ మురళీకృష్ణ, రైస్ ​మిల్లర్ల సంఘం ప్రతినిధులు, రైస్​ మిల్లర్లు పాల్గొన్నారు.

భూసమస్యల పరిష్కారంలో సర్వేయర్లు నిబంధనలు పాటించాలి 

భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన భూభారతి చట్టంలోని ప్రతి అంశంపై  సర్వేయర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సమస్యల పరిష్కారంలో నిబంధనలు పాటించాలని కలెక్టర్ సూచించారు. మంచిర్యాలలోని శ్రీ ఉషోదయ స్కూల్​లో ఏర్పాటు చేసిన లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమానికి జిల్లా సర్వే, భూరికార్డుల ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్​తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వే ప్రక్రియలో సర్వేయర్ల పాత్ర కీలకమైందన్నారు. అంతర్గత సరిహద్దుల నిర్ణయంలో, సరిహద్దు వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.