- మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల/నస్పూర్, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే కె.ప్రేమ్‌సాగర్‌రావు, అడిషనల్ కలెక్టర్లు పి.చంద్రయ్య, రాములుతో కలిసి అగ్రికల్చర్, రెవెన్యూ అధికారులు, రైస్ మిల్లర్స్, లారీ ఓనర్స్అసోసియేషన్ ప్రతినిధులు, సెంటర్ల నిర్వాహకులతో కలెక్టరేట్‌లో రివ్యూ నిర్వహించారు. రైతుల ధాన్యాన్ని పరిశీలించి టోకెన్లు అందించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. కాంటా చేసిన వడ్లను ఎప్పటికప్పుడు గోడౌన్లు, రైస్ మిల్లులకు తరలించాలన్నారు.
జిల్లాలో 12 రైస్ మిల్లులు మాత్రమే పనిచేస్తున్నాయని, వారికి ట్యాగింగ్ ఇచ్చిన ప్రకారం రోజుకు కనీసం 10 లారీలకు తగ్గకుండా దించుకోవాలని ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో అధికారులు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలన్నారు. రైస్ మిల్లులు, లారీలు, హమాలీలు, సెంటర్లలో తలెత్తే సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆర్డీవో జి.శ్రీనివాస్‌రావు, అధికారులు పాల్గొన్నారు.
