- మంచిర్యాల జిల్లాలో 87 పర్సెంట్సీ సెక్షన్లు
- పెద్ద దవాఖాన్లలో అడ్డగోలు దోపిడీ
- ఒక్కో ఆపరేషన్‌కు రూ.50 వేలు వసూలు
- కంట్రోల్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని పలు ప్రైవేట్ హాస్పిటళ్లలో డెలివరీలు అంటేనే జనాలు భయపడుతున్నారు. పురుడు కోసం దవాఖానాకు పోతే కడుపు కోత తప్పదని ఆందోళన చెందుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటళ్లలో సరైన వైద్యం అందకపోవడంతో గర్భిణులు ప్రైవేట్ బాట పడుతున్నారు.
ఇదే అదునుగా కొంతమంది డాక్టర్లు కాన్పులు అంటేనే కాసుల వేట అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. డెలివరీ కేసు వచ్చిందంటే ఆపరేషన్ చేయడానికి రెడీగా ఉంటున్నారనే అపవాదును మూట కట్టుకుంటున్నారు. ఓవైపు ప్రభుత్వం సీ సెక్షన్లను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటుంటే.. ప్రైవేట్ డాక్టర్లు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ సర్కారు ఆశయానికి గండికొడుతున్నారు.
87 శాతం సీ సెక్షన్లే..
జిల్లాలోని వివిధ ప్రైవేట్ హాస్పిటళ్లలో సీ సెక్షన్ల సంఖ్య తగ్గకపోగా రోజురోజుకు పెరుగుతున్నట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని పేరున్న పెద్ద హాస్పిటళ్లలో ఈ ధోరణి విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఇటీవల కాలంలో డెలివరీ అంటేనే గర్భిణులు, కుటుంబ సభ్యులు భయపడిపోతున్నారు. నార్మల్ డెలివరీ కావడానికి చాన్స్ ఉన్నప్పటికీ పురిటినొప్పుల బాధ తట్టుకోలేక ఆపరేషన్లకు మొగ్గు చూపుతున్నారు. ప్రజల్లో నెలకొన్న ఈ భయాన్ని ప్రైవేట్ డాక్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు.
అలాగే వివిధ కారణాలు చెప్పి గర్భిణులను సీ సెక్షన్లకు ప్రోత్సహిస్తున్నారు. దీనికి తోడు జిల్లాలో ముహూర్తపు డెలివరీలు పెద్ద సంఖ్యలో జరగడం సీ సెక్షన్ రేటు పెరగడానికి కారణమవుతోంది. మంచి రోజు చూసి ఫలానా ముహూర్తంలోనే డెలివరీ చేయాలని పట్టుబట్టడం డాక్టర్ల దురాశకు అనుకూలంగా మారింది. ఫలితంగా జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో సీ సెక్షన్ రేటు 87 శాతానికి చేరింది. అంటే ప్రతి వంద కాన్పులకు 87 సీ సెక్షన్లే జరుగుతున్నాయి. కేవలం 13 మాత్రమే నార్మల్ డెలివరీలు కావడం గమనార్హం.
ప్రిమి సీ సెక్షన్ల పేరిట
మొదటిసారి గర్భం దాల్చిన మహిళలకు చేసే సిజేరియన్లను ప్రిమి సీ సెక్షన్ అంటారు. దీనికి సాధారణ కారణాలుగా శిశువు కదలికలు, తగినంత బలం లేకపోవడం, ప్రసవ సమయానికి శిశువు సరైన స్థితిలో లేకపోవడం, లేదా శిశువు గుండె కొట్టుకునే విధానంలో తేడాలు వంటివి చెప్పి భయభ్రాంతులకు గురిచేస్తారు. ఈ ప్రక్రియలో గర్భాశయం, పొత్తికడుపులో కోత పెట్టి శిశువును బయటకు తీస్తారు. ఇలా మొదటిసారి సీ సెక్షన్ జరిగితే ఆ తర్వాత జరిగే డెలివరీలకు కూడా ఆపరేషన్లు చేయాల్సి వస్తుంది. దీనివల్ల మహిళల ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కావున ఒకే డాక్టర్‌పై ఆధారపడకుండా సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
డెలివరీకి రూ.50 వేల పైనే..
ప్రైవేట్ హాస్పిటళ్లలో డెలివరీ అంటేనే పేద, మధ్య తరగతి వర్గాల తల్లిదండ్రులు వణికిపోతున్నారు. కొన్ని పెద్ద హాస్పిటళ్లలో ఒక డెలివరీకి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్యాకేజీల రూపంలో కొంత డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ బయటి ఖర్చులు కలుపుకుంటే రూ.50 వేల పైనే అవుతోంది. హాస్పిటళ్లలో హంగులను ప్రదర్శించి విచ్చలవిడిగా డబ్బులు గుంజుతున్నారు.
వీటిని కంట్రోల్ చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయా హాస్పిటళ్లలో జరుగుతున్న సీ సెక్షన్లపై విచారణ చేపడితే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ పలువురు డాక్టర్లు తమకున్న పలుకుబడితో అధికారులను శాసిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
