
- కనీస సౌలత్లు లేక తల్లీబిడ్డలకు తిప్పలు
- వాటర్ క్యాన్లు, ఫ్యాన్లు తెచ్చుకోవాల్సిందే
- అధ్వానంగా శానిటేషన్
మంచిర్యాల, వెలుగు: గవర్నమెంట్ హాస్పిటళ్లలో డెలివరీల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ఓవైపు కేసీఆర్కి ట్లు ఇస్తుంటే.. మరోవైపు హాస్పిటల్ సిబ్బంది పేషెంట్ల దగ్గర చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సర్జరీ అయితే రూ.వెయ్యి, నార్మల్ డెలివరీకి రూ.500 చొప్పున రేటు ఫిక్స్చేశారు. పైసలు ఇస్తేనే గానీ బిడ్డను చేతిలో పెట్టడం లేదంటే వసూళ్ల పర్వం ఎట్లా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. మంచిర్యాలలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో సాగుతున్న దందా ఇది. మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని జిల్లా హాస్పిటల్లో ఉన్న ఎంసీహెచ్‌ను గోదావరి రోడ్లో నిర్మించిన కొత్త బిల్డింగ్‌లోకి షిఫ్ట్చేశారు. నెల రోజులుగా తల్లీబిడ్డలకు అక్కడే వైద్యసేవలు అందిస్తున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతాల నుంచి మహిళలు డెలివరీ కోసం ఈ హాస్పిటల్‌కు వస్తుంటారు. రోజూ వందకు పైగా ఓపీ కేసులు వస్తున్నాయి. సగటున10 నుంచి 15 డెలివరీలు చేస్తుండగా ఇందులో సగానికిపైగా సర్జరీలు ఉంటున్నాయి. డాక్టర్లు బాగానే చూస్తున్నారని, ఇక్కడ పనిచేసే సిబ్బంది మాత్రం పైసల కోసం సతాయిస్తున్నారని పేషెంట్లు చెబుతున్నారు. సర్జరీ అయితే రూ.వెయ్యి, నార్మల్ డెలివరీకి రూ.500, డ్రెస్సింగ్‌కు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. పైసలు ఇస్తేనే బిడ్డలను చేతిలో పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎంసీహెచ్‌కు వచ్చేవాళ్లలో మెజారిటీ పేదలే కావడంతో సిబ్బంది తీరుతో ఇబ్బందులు పడుతున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చిపోవడానికి రవాణా ఖర్చులకే పైసల్లేక పరేషాన్అవుతున్నామని చెబుతున్నారు. ఎంసీహెచ్‌లో ఫ్రీగా డెలివరీ చేస్తారని వస్తే సిబ్బంది డబ్బుల కోసం వేధిస్తున్నారని వాపోతున్నారు.
అన్నీ సమస్యలే..
రూ.17 కోట్లతో నిర్మించిన ఎంసీహెచ్‌లో ఎలాంటి సౌలత్లు కల్పించకపోవడంతో పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. 100 బెడ్స్హాస్పిటల్లో తాగునీళ్లు కూడా లేవు. ఇటీవల ఇండియన్ రెడ్‌క్రాస్‌సొసైటీ ఆధ్వర్యంలో వాటర్ కూలర్అందజేయగా, ఓపీ దగ్గర ఏర్పాటు చేశారు. వార్డుల్లో తాగునీటి సౌకర్యం లేదు. పేషెంట్లు రూ.50 చెల్లించి కూల్వాటర్క్యాన్లు కొనుక్కుంటున్నారు. వార్డుల్లో సీలింగ్‌ఫ్యాన్లు ఉన్నప్పటికీ ఎండాకాలం కావడంతో ఉక్కపోత భరించలేకపోతున్నారు. పలువురు పేషెంట్లు ఇంటి దగ్గర నుంచి ఫ్యాన్లు, కూలర్లు తెచ్చుకుంటున్నారు. ఓపీ దగ్గర, వెయిటింగ్ ఏరియాల్లో సీలింగ్‌ఫ్యాన్లు సైతం లేవు. బెడ్షీట్లు కూడా లేకపోవడంతో ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు.
కంపు కొడుతున్న వార్డులు
ఎంసీహెచ్‌లో శానిటేషన్అధ్వానంగా మారింది. 40 నుంచి 45 మంది శానిటేషన్ సిబ్బంది అవసరం కాగా, ఔట్‌సోర్సింగ్‌లో 10 మందిని మాత్రమే నియమించారు. పనిభారం భరించలేక ఇద్దరు మానేశారు. ప్రస్తుతం 8 మంది మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. డస్ట్బిన్లు కూడా సరిపడా ఏర్పాటు చేయకపోవడంతో పేషెంట్లు చెత్తను బెడ్స్పక్కనే పారేస్తున్నారు. దీంతో వార్డుల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. టాయ్లెట్లలో సరిగా నీళ్లు రావడం లేదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోవడంతో కంపు కొడుతున్నాయని పేషెంట్లు వాపోతున్నారు. వార్డుల దగ్గర సెక్యూరిటీ సిబ్బందిని నియమించకపోవడంతో జనం ఇష్టానుసారం తిరుగుతున్నారు. ఒక్కో బెడ్ దగ్గర ముగ్గురు నలుగురు బంధువులు ఉంటున్నారు. అలాగే హాస్పిటల్ఆవరణలో పార్కింగ్ఏరియా, షాపుల కోసం షెడ్లు, క్యాంటీన్ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.
దవాఖాన గిట్లనే ఉంటదా?
వార్డుల్లో తాగుదామంటే నీళ్లు లేవు. రోజూ రూ.50 చెల్లించి కూల్ క్యాన్లు కొనుక్కుంటున్నం. ఫ్యాన్లు ఉన్నా ఉక్కపోత భరించలేకపోతున్నం. ఇంటి నుంచి కూలర్ తెచ్చుకున్నం. వర్కర్లు తక్కువ మంది ఉన్నరు. సక్కగ ఊడుస్తలేరు.. తుడుస్తలేరు. డస్ట్బిన్లు కూడా రెండే ఉన్నయి. బాత్రూంలల్ల నీళ్లు సక్కగ వస్తలేవ్. కంపు కొడుతున్నయి. ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు. దవాఖానా గిట్లనే ఉంటదా? – కుడుదుల అంజయ్య, సింగాపూర్
పైసలు అడుగుతున్నరు
ఎంసీహెచ్ కొత్తగ కట్టిన్రు. మంచిగ ఉంటదని వచ్చిన. నాకు ఇది రెండో కాన్పు. ఆపరేషన్ చేసిన్రు. బాబు పుట్టిండు. డాక్టర్లు బాగానే చూస్తున్నరు. కానీ వర్కర్లు పైసలు అడుగుతున్నరు. ఆపరేషన్అయితే రూ. వెయ్యి, నార్మల్ డెలివరీకి 500 ఇయ్యాలంటున్నరు. అంత ఇచ్చుకోలేమని బతిమిలాడినా వినిపించుకోవట్లే. వార్డుల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. మంచినీళ్లు కూడా దొరుకుతలేవు.
– గూడ శ్యామల, నర్సింగాపూర్