కార్పొరేషన్లో ట్రయాంగిల్ ఫైట్.. మంచిర్యాల బల్దియాపై మూడు పార్టీల ఫోకస్

కార్పొరేషన్లో ట్రయాంగిల్ ఫైట్..   మంచిర్యాల బల్దియాపై మూడు పార్టీల ఫోకస్
  • మేయర్​ సీటు టార్గెట్​గా పావులు కదుపుతున్న వైనం
  • టికెట్ల కోసం లీడర్ల నడుమ పోటీ.. జోరుగా పైరవీలు 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్​కార్పొరేషన్​పై మూడు ప్రధాన పార్టీలు పోకస్​పెట్టాయి. ఎన్నికల్లో బల్దియాపై జెండా ఎగరేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. కార్పొరేషన్​లో గెలిస్తే జిల్లా కేంద్రంపై పట్టు సాధించవచ్చని, తద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ బలం కలిసివస్తుందని భావిస్తున్నాయి. గతంలో మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాల నిరుడు జనవరిలో కార్పొరేషన్​గా ఆవిర్భవించింది. పక్కనున్న నస్పూర్​మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని ఐదు గ్రామపంచాయతీలను ఇందులో విలీనం చేసిన విషయం తెలిసిందే.

దీంతో నగర పరిధి భారీగా విస్తరించడమే కాకుండా ఓటర్ల సంఖ్య లక్షా 81 వేలకు చేరింది. మంచిర్యాల సెగ్మెంట్​లో ఉన్న మొత్తం ఓటర్లలో దాదాపు మూడో వంతు కార్పొరేషన్​ పరిధిలోకి వచ్చారు. ఈ కారణంగా మున్సిపల్​ఎన్నికల్లో మంచిర్యాల కార్పొరేషన్​ అన్ని పార్టీలకు కీలకంగా మారింది.

అభివృద్ధి నినాదంతో కాంగ్రెస్​ ముందుకు..

మున్సిపల్​ఎన్నికలను అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 67 వేల భారీ ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు కార్పొరేషన్​లో గెలిగి తన పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. గత రెండేండ్లలో తాను చేసిన అభివృద్ధే గెలిపిస్తుందనే దీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే జిల్లా కేంద్రంలోని మెయిన్​ రోడ్లను మెరుగుర్చారు. రూ.11 కోట్లతో గోదావరి రోడ్​లో ఆధునిక వసతులతో మహాప్రస్థానం నిర్మించారు. మంచిర్యాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.255 కోట్లతో రాళ్లవాగు కరకట్ట మంజూరు చేయించారు.

ఆ పనులు స్పీడ్​గా సాగుతున్నాయి. మార్కెట్​ఏరియాలో రోడ్ల వెడల్పు చేపట్టడంతో పాటు రూ.76 కోట్లతో అండర్ గ్రౌండ్ ​డ్రైనేజీ, ఎలక్ట్రికల్​కేబులింగ్ ​సిస్టమ్​ సాంక్షన్​ చేయించారు. ఐబీలో రూ.350 కోట్లతో సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్, ఎంసీహెచ్​నిర్మాణం చేపడుతున్నారు. లక్ష్మీ టాకీస్​నుంచి రాళ్లవాగు మీదుగా సిక్స్ లేన్​ రోడ్డు, రాళ్లవాగుపై హైలెవల్ ​బ్రిడ్జి పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కార్పొరేషన్​ పరిధిలోని వేంపల్లి శివారులో 250 ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్​కు శంకుస్థాపన చేశారు. మున్సిపల్​ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలతో మీటింగులు​నిర్వహిస్తూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్నారు. 

పావులు కదుపుతున్న బీజేపీ

కాంగ్రెస్ ​ప్రభుత్వ వైఫల్యాలు, అమలు కాని హామీలను ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్​ లీడర్ల భూ కబ్జాలు, బెదిరింపులు, దాడుల నేపథ్యంలో ప్రజలు అధికార పార్టీపై విసుగుచెందారని, ఆ వ్యతిరేకతను వాడుకొని మున్సిపల్​ఎన్నికల్లో గెలవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 40 వేల ఓట్లు సాధించి సెకండ్ ​ప్లేస్​లో నిలిచింది. గత రెండేండ్లలో అర్బన్​ఏరియాలో తమ పార్టీ మరింత బలం పుంజుకుందని కమలనాథులు భావిస్తున్నారు. అదే ఉత్సాహంతో సరైన అభ్యర్థులను బరిలోకి దించి బల్దియాపై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యమంటున్నారు. కార్పొరేషన్​లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.

పూర్వ వైభవం కోసం బీఆర్ఎస్

గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన బీఆర్ఎస్​ ఈసారి మున్సిపల్​ఎన్నికల్లో గెలిచి పూర్వవైభవం చాటుకోవాలని తహతహలాడుతోంది. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బల్దియాపై గులాబీ జెండా ఎగిరింది. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్​ ప్రభుత్వం కూలిపోగానే ఆ పార్టీకి చెందిన మెజారిటీ కౌన్సిలర్లు కారు దిగి హస్తానికి జైకొట్టారు. దీంతో ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు అవిశ్వాస తీర్మానం ద్వారా బీఆర్ఎస్​ను గద్దె దించి బల్దియాను హస్తగతం చేసుకున్నారు. దాంతో ఆ పార్టీ పూర్తిగా డీలా పడింది. 

టికెట్ల కోసం పోటాపోటీ 

మున్సిపల్​ఎన్నికల్లో టికెట్ల కోసం లీడర్లు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్​ టికెట్​ వస్తే సగం గెలుపు ఖాయమైనట్టేనని భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీలో ఒక్కో డివిజన్​ నుంచి ముగ్గురు, నలుగురు ముందుకొస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలోనూ పలు డివిజన్లలో టికెట్ల కోసం పోటీ ఉంది. దీంతో ఎవరి స్థాయిలో వారు పైరవీలు చేస్తున్నారు. అన్ని పార్టీలు సర్వేల ద్వారానే గెలుపు గుర్రాలను బరిలోకి దించుతామని పేర్కొనడంతో టికెట్​ ఎవరికి దక్కుతుందోనని లీడర్లు టెన్షన్ పడుతున్నారు.