‘డబుల్’ ట్రబుల్ ఎన్నాళ్లు?

‘డబుల్’ ట్రబుల్ ఎన్నాళ్లు?
  • పూర్తయిన ఇండ్లను పంచుతలేరు
  • పూర్తయినవి పంచడంలో తాత్సారం  
  • విసిగిపోయి ఆక్రమించుకున్న పేదలు 
  • ఖాళీ చేయించేందుకు ఆఫీసర్ల తంటాలు 

మంచిర్యాల,వెలుగు: టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పేదలందరికీ డబుల్​ బెడ్​రూమ్​లు ఇస్తామని చెప్పి ఏండ్లు గడుస్తున్నాయి. కానీ పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. జిల్లాకు మంజూరైనవే తక్కువ ఇండ్లు కాగా వాటి నిర్మాణాలు సైతం నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్​ కాస్ట్​ గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారింది. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయిన వాటిలో కరెంట్​, వాటర్​, రోడ్లు వంటి చిన్న చిన్న పనులను  పెండింగ్​ పెట్టారు. ఇవి ఎప్పుడు పూర్తవుతాయో, తమకు ఇండ్లు ఎప్పుడు వస్తాయోనని పేదలు ఎదురుచూస్తున్నారు. పట్టణాల్లో కూలినాలి చేసుకునే చాలామంది వేలల్లో ఉన్న ఇంటి కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.  

ఐదేండ్లు అవుతున్నా...  

జిల్లాకు 2416 డబుల్​ బెడ్​రూమ్​లు మంజూరయ్యాయి. 2017లో పనులు ప్రారంభించారు. ఇందులో 1044 నిర్మాణాలు పూర్తి కాగా, 806 పనులు కొనసాగుతున్నాయి. మరో 116 పనులు ప్రారంభించాల్సి ఉండగా, 450 ఇండ్లకు పరిపాలన అనుమతులు రావాల్సి ఉంది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్​నగర్​లో 650 డబుల్​ బెడ్​రూమ్​లు నిర్మిస్తున్నారు. రెండు దశల్లో 260 ఇండ్లు పూర్తి కాగా, స్థల వివాదం, కోర్టు కేసులతో 48 ఇండ్లు నిలిచిపోయాయి. మిగతా పనులు నత్తనడనక కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు స్థలాలు కోల్పోయిన 30 మందికి మాత్రమే డబుల్​ ఇండ్లు కేటాయించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీకి కేవలం 160 ఇండ్లు మంజూరు కాగా, పనులు స్లోగా జరుగుతున్నాయి. మరో 400 ఇండ్లకు పరిపాలన అనుమతులు వచ్చాయి. మందమర్రి, క్యాతన్​పల్లి మున్సిపాలిటీల్లో డబుల్​ ఇండ్ల పనులు తుది దశకు చేరాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్​, వాటర్​ సప్లై వంటి మౌలిక సదుపాయాల పనులు పూర్తి కావాల్సి ఉంది. చెన్నూర్​లో 2019లో పనులు ప్రారంభించినా ఇంకా పునాదులు, పిల్లర్ల దశలోనే మగ్గుతున్నాయి. ఇక్కడ 300 డబుల్​ బెడ్​రూమ్​లు నిర్మిస్తున్నారు. నస్పూర్​, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో టెండర్ల దశలోనే ఆగిపోయాయి. నియోజకవర్గానికి 4వేలకు పైగా ఇండ్లు మంజూరు చేసినట్టు ప్రకటించినా ఇంతవరకు వాటి జాడ లేకపోవడం గమనార్హం.