చెరువులకు పునరుజ్జీవం

చెరువులకు పునరుజ్జీవం
  • మంచిర్యాల జిల్లాలో రూ.16.09 కోట్లతో ఏడు చెరువుల డెవలప్​మెంట్ 
  • అమృత్ 2.0 స్కీమ్​కింద ఎంపిక 
  • టెండర్లు పూర్తి... త్వరలోనే పనులు ప్రారంభం
  • నీటి పెంపుతో పాటు పర్యాటకంగా అభివృద్ధి

మంచిర్యాల, వెలుగు: పట్టణ ప్రాంతాల్లోని పలు చెరువులు మురుగు నీటితో కలుషితమయ్యాయి. మరికొన్ని కట్టలు బలహీనపడి ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. ఇటువంటి చెరువులను అభివృద్ధి చేసి ఏండ్ల పాటు పటిష్టంగా ఉండేలా చేయడం ద్వారా పునరుజ్జీవం కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా అమృత్ 2.0 పథకం కింద మంచిర్యాల జిల్లాలోని ఏడు చెరువులను సెలెక్ట్ చేశారు. వీటిని రూ.16.09 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇటీవలే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేశారు. 

చేపట్టనున్న పనులివే.. 

మురుగునీరు చెరువుల్లో చేరకుండా దారిమళ్లించడం (డ్రెయిన్ వాటర్ డైవర్షన్), చెరువు కట్టలకు రెండు వైపులా రాళ్లు అమర్చి బలోపేతం (బండ్ స్ట్రెంథెనింగ్) చేయనున్నారు. అలాగే అప్ అండ్ డౌన్ స్ట్రీమ్స్​కు రెయిలింగ్, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఆక్రమణలు ఉంటే తొలగిస్తారు. చెరువులకు జలకళ తీసుకురావడం, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడతారు. తద్వారా చెరువులను పరిరక్షించడమే కాకుండా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యం. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్​కు చెందిన ఆర్ఆర్ ఎడిఫీజ్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులను 24 నెలల్లోగా పూర్తి చేయాలి. కానీ గడువుకు ముందే కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పబ్లిక్ హెల్త్ అధికారులు పేర్కొన్నారు. 

ఆక్రమణల తొలగింపు సాధ్యమనా?

పట్టణ ప్రాంతాల్లోని చెరువులకు ఎన్​క్రోచ్​మెంట్స్ పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే పలు చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. జిల్లా కేంద్రంలోని రాముని చెరువు విస్తీర్ణం 46 ఎకరాలు కాగా హైటెక్ సిటీ కాలనీ వైపు ఎఫ్​టీఎల్, బఫర్ జోన్​ను ఆక్రమించి భారీ బిల్డింగులు నిర్మించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

హైటెక్ సిటీ గ్రౌండ్ నుంచి క్లబ్​కు వెళ్లే దారిలో ఏకంగా చెరువు మధ్య నుంచే రోడ్డు వేశారు. గతంలో ఇరిగేషన్ అధికారులు కందకాలు తవ్వినప్పటికీ వాటిని పూడ్చివేసి రోడ్డు నిర్మించారు. లక్సెట్టిపేటలోని ఇటిక్యాల చెరువుదీ అదే పరిస్థితి. ఎఫ్​టీఎల్​తో పాటు బఫర్ జోన్​లో భారీగా మట్టి పోసి బిల్డింగులు కట్టారు. ఊరు మందమర్రి చెరువు బఫర్ జోన్​లో సైతం ఎన్​క్రోచ్​మెంట్లు ఉన్నాయి. ఈ ఆక్రమణలను తొలగించడం అధికారులకు సాధ్యమయ్యేనా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

సిల్ట్ తీస్తేనే జలకళ..

అమృత్ 2.0 కింద ఎంపిక చేసిన పలు చెరువులు పూడికతో నిండిపోయాయి. వాటిలో సిల్ట్ తొలగించకుండా పునరుజ్జీవం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో మంచిర్యాల రాముని చెరువులో సిల్ట్ తీసే పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలేశారు. టీయూఎఫ్​డీసీ ఫండ్స్ రూ.3.60 కోట్లతో బ్యూటిఫికేషన్ పనులు చేపట్టినా అవి పూర్తికాలేదు.

పలు చెరువులను మినీ ట్యాంక్​బండ్లుగా మార్చే పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అలాగే కాలనీల నుంచి వచ్చే మురుగు నేరుగా చెరువుల్లో కలిసి కలుషితమవుతున్నాయి. పునరుజ్జీవం పనుల్లో భాగంగా డ్రెయిన్ వాటర్ డైవర్షన్ పూర్తిస్థాయిలో జరిగితేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎంపిక చేసిన చెరువుల వివరాలు... 

చెరువు పేరు    ఫండ్స్ 
(రూ.కోట్లలో)
కుమ్మరికుంట (చెన్నూరు )    1.87
పెద్ద చెరువు (నస్పూర్)    3.14
రాముని చెరువు (మంచిర్యాల)    1.98
ఇటిక్యాల చెరువు (లక్సెట్టిపేట)     3.14
కుమ్మరి చెరువు (క్యాతనపల్లి)    2.09
విలేజ్ మందమర్రి చెరువు    2.31
జాతికుంట (బెల్లంపల్లి )    1.56
మొత్తం        16.09