రూ.4 కోట్లు వృథా .. మంచిర్యాలలోని ట్రాఫిక్ ఐలాండ్స్ తొలగింపు

రూ.4 కోట్లు వృథా .. మంచిర్యాలలోని ట్రాఫిక్ ఐలాండ్స్ తొలగింపు
  • మూడేండ్ల కింద నాలుగు చౌరస్తాల్లో ఏర్పాటు
  • ఒక్కో థీమ్​తో ముస్తాబు చేసిన అడిషనల్​ కలెక్టర్
  • ఐలాండ్స్​పెద్దగా ఉన్నాయని తొలగించిన వైనం
  • మళ్లీ కోట్ల ఖర్చుతో కొత్తగా నిర్మాణాలకు ప్లాన్​ 
  • మున్సిపల్​ కార్పొరేషన్​ సొమ్ము దుబారా

మంచిర్యాల, వెలుగు: ప్రజాప్రతినిధులు, అధికారుల అనాలోచిత చర్యలతో మంచిర్యాల మున్సిపల్​ కార్పొరేషన్ ​సొమ్ము దుబారా అవుతోంది. ప్రజలకు ఏది అవసరమో ఆలోచించకుండా హడావుడిగా అభివృద్ధి పనులు చేపట్టడం, మళ్లీ వాటిని తొలగించి కొత్తగా నిర్మించడం పరిపాటిగా మారింది. ప్రజా ధనమే కదా మాదేం పోయిందని అనుకుంటున్నారో ఏమో గానీ ఇప్పటికే ఇలాంటి చర్యలతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఐలాండ్స్​ను రాత్రికి రాత్రే తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు.

ఐలాండ్స్​ పెద్దగా.. రోడ్లు ఇరుకుగా.. 

మంచిర్యాల సిటీ బ్యూటిఫికేషన్​లో భాగంగా మూడేండ్ల క్రితం మెయిన్​ రోడ్​లోని ఐబీ చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్​ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మి టాకీస్ ​చౌరస్తాల్లో ట్రాఫిక్ ఐలాండ్స్​ నిర్మించారు. ఒక్కో దానికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.4 కోట్ల వరకు ఖర్చు చేశారు. అప్పటి లోకల్​ బాడీస్​ అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్​ప్రత్యేక చొరవ తీసుకొని ఒక్కో చౌరస్తాలో ఒక్కో థీమ్​తో ఐలాండ్స్​ను అందంగా తీర్చిదిద్దారు. అయితే రోడ్లను వెడల్పు చేయకుండా పెద్ద పెద్ద ఐలాండ్స్​ నిర్మించడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. 

ఇలా నిర్మించడం వల్ల సిగ్నల్స్​అవసరం లేకుండానే ట్రాఫిక్ ఆటోమేటిక్​గా కంట్రోల్​ అవుతుందని సమర్థించుకున్నారు. కానీ ఐలాండ్స్​ దగ్గర రోడ్లు ఇరుకుగా మారడం వల్ల తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. స్పీడ్​గా వచ్చిన వెహికల్స్​ ఐలాండ్స్​దగ్గర కంట్రోల్​ కాకపోవడంతో పలువురు వాటిని ఢీకొన్న ఘటనలున్నాయి. లక్ష్మి టాకీస్​ చౌరస్తాలోని ఐలాండ్​వద్ద ఇద్దరు యువకులు యాక్సిడెంట్​లో చనిపోయిన విషయం తెలిసిందే. 

రోడ్లు వెడల్పు చేస్తూ.. ఐలాండ్స్​ తొలగింపు

ఐబీ చౌరస్తా నుంచి ఏసీసీ శివారులోని శ్రీనివాస గార్డెన్ ​వరకు మెయిన్​ రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వెంకటేశ్వర టాకీస్, లక్ష్మి టాకీస్​ చౌరస్తాల్లోని ఐలాండ్స్​ను రాత్రికి రాత్రే తొలగించారు. ఐబీ చౌరస్తాలోని ఐలాండ్​ను ఆర్నెళ్ల క్రితం కుదించి అక్కడ పాత ప్లాన్​ ప్రకారం పార్ల మెంట్​నమూనాను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ఓల్డ్​విగ్రహాన్ని తొలగించి కొత్తది ప్రతిష్ఠించారు. బీఆర్ఎస్ ​హయాంలో నిర్మించిన ఐలాండ్స్​ను కావాలనే కాంగ్రెస్ ఎమ్మెల్యే తొలగిస్తున్నారని.. ప్రజాధనం వృథా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్​రావు, లీడర్లు ఆందోళనకు దిగారు. 

తాజాగా వెంకటేశ్వర టాకీస్, లక్ష్మి టాకీస్ ​చౌరస్తాల్లోని ఐలాండ్స్​ను పూర్తిగా తొలగించారు. తొలగించిన వాటి స్థానంలో కొత్తవి నిర్మించి ట్రాఫిక్ జంక్షన్లు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే రోడ్లు వెడల్పు చేస్తుండడంతో ఐలాండ్స్​ను తొలగించాల్సిన అవసరమే లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కోట్లాది రూపాయల మున్సిపల్​ ఫండ్స్​ను దుబారా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. 

ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదు... 

గతంలో మంచిర్యాలలో రూ.4కోట్లతో నాలుగు ఐలాండ్స్​ నిర్మించారు. ఎమ్మెల్యే మారిన తర్వాత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోందని వాటిని ఇప్పుడు తొలగించారు. ఈ మధ్యకాలంలోనే కట్టిన వాటిని తొలగించడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎమ్మెల్యేలు మారినప్పుడల్లా ఈవిధంగా విలువైన నిర్మాణాలను తొలగించడం వల్ల ప్రజలపై భారం పడుతుందనే సోయి లేకపోవడం విచారకరం. అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు లొంగకుండా చట్టపరిధిలో బాధ్యతగా పనిచేయాలి. 

 తుల మధుసూదన్​రావు, బీజేపీ లీడర్​