
- లేఔట్ పర్మిషన్ కోసం దరఖాస్తు
- అధికారుల జాయింట్ సర్వేలో బయటపడ్డ నిజం
- పట్టా రద్దు, లేఔట్ పర్మిషన్క్యాన్సల్ చేయాలని సిఫార్సు
మంచిర్యాల, వెలుగు; మందమర్రి మండలం తిమ్మాపూర్గ్రామ శివారులోని బొక్కలగుట్టలో 11 ఎకరాల ఫారెస్ట్ల్యాండ్పట్టాగా మారి అక్కడ రియల్ఎస్టేట్వెంచర్వెలిసింది. పట్టదారులు ఇటీవల లేఔట్పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఫారెస్ట్, రెవెన్యూ, మున్సిపల్అధికారుల జాయింట్సర్వేలో దాన్ని ఫారెస్ట్ ల్యాండ్‌గా గుర్తించారు. లేఔట్పర్మిషన్ రద్దు చేయడమే కాకుండా గతంలో ఇచ్చిన అక్రమ పట్టాను రద్దు చేయాలని, కొత్తగా ఎవరికీ పట్టాలు ఇవ్వకూడదని రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఫారెస్ట్ అధికారులు సిఫార్సు చేశారు. ఫారెస్ట్ ల్యాండ్పట్టాగా ఎట్ల మారిందన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆ భూమి చేజారిపోకుండా పట్టాదారులు, రియల్టర్లు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం అక్కడ ఎకరానికి రూ.కోటి చొప్పున రూ.11 కోట్లు పలుకుతుండడంతో ఎలాగైనా ప్లాటింగ్ చేయాలని పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.
గతంలో పేదలకు ఇండ్ల స్థలాల కోసం..
బొక్కలగుట్ట నుంచి గాంధారిఖిలాకు వెళ్లే దారిలో సర్వే నంబర్31లో ఈ 11 ఎకరాల భూమి ఉంది. ఈ భూమితోపాటు పక్కనే ఉన్న మరో 29 ఎకరాలను 1986లో బొక్కలగుట్టకు చెందిన పేదలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించారు. ఆ సమయంలోనే ఈ 40 ఎకరాల భూమిని ఫారెస్ట్ నుంచి రెవెన్యూకు బదలాయించినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ మౌలిక సదుపాయాలు లేక పేదలు ఇండ్లు కట్టుకోకపోవడం వల్ల ఈ భూమి ఖాళీగా ఉంది. రెండు మూడేండ్ల కిందట 31 సర్వేనంబర్‌లోని 11 ఎకరాలు మినహా మిగిలిన 29 ఎకరాలను ప్రభుత్వం చేపట్టే సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించారు. అందులో పల్లె ప్రకృతివనం, బృహత్ ప్రకృతివనం, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులు నిర్మించారు. అయితే ఈ భూములు ఫారెస్ట్ నుంచి రెవెన్యూకు బదలాయించినట్టుగా రెండు డిపార్ట్మెంట్ల దగ్గర ఎలాంటి రికార్డులు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
రికార్డుల్లో మార్పులు చేసి
సర్వేనంబర్31లోని 11 ఎకరాల భూమిని బొక్కలగుట్టకు చెందిన ఓ భూస్వామి తన కూతురి పేరుపై పట్టా చేసుకొని ఇద్దరు వ్యక్తులకు అమ్మాడు. అయితే, ఇది 31 సర్వే నంబర్ కాదని, 31/11 సర్వే నంబర్అని పట్టాదారులు, కొనుగోలుదారులు వాదిస్తు
న్నారు. దీనికి ఆధారాలుగా 1913 శేత్వార్, 1954 కాస్ర పహానీతో పాటు ఆ తర్వాత పహానీలను చూపుతున్నారు. తిమ్మాపూర్ శివారులోని భీమా గార్డెన్సమీపంలో గల 11 సర్వే నంబర్లో 1.26 ఎకరాల భూమి మాత్రమే ఉంది. బొక్కలగుట్టలోని 31 సర్వే నంబర్‌ను 31/11గా రికార్డుల్లో మార్చి 11 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్‌ను పట్టా చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఫారెస్ట్ బౌండరీలు తొలగించి..
బొక్కలగుట్ట సమీపంలోని 31/11 సర్వేనంబర్‌లో పట్టాగా పేర్కొంటున్న భూమి గతంలో ఫారెస్ట్ బౌండరీల పరిధిలో ఉంది. ఓ మాజీ ప్రజాప్రతినిధి, మరికొందరు ఈ భూమిని కొని 15, 16 నంబర్ ఫారెస్ట్ బౌండరీ పిల్లర్లను తొలగించి ప్లాటింగ్ చేశారు. అయినప్పటికీ అధికారులు నాలా కన్వర్షన్‌కు పర్మిషన్ ఇవ్వడం, ఫారెస్ట్ భూమి అని గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలిసే చేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూలై 27న నిర్వహించిన జాయింట్సర్వేలో మాత్రం సదరు 11 ఎకరాలను ఫారెస్ట్ ల్యాండ్‌గా నిర్ధారించినట్టు ఎఫ్ఆర్వో స్వామి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎఫ్డీవోకు రిపోర్టు సమర్పించారు. అలాగే ఈ భూమిలో లేఔట్పర్మిషన్లు ఇవ్వరాదని మున్సిపల్ కమిషనర్‌కు, ఓల్డ్ పట్టాలు క్యాన్సల్ చేయాలని మందమర్రి తహసీల్దార్‌కు సూచించారు. కోట్ల విలువైన ఈ భూమిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్వాధీనం చేసుకోవాలని, లేదంటే పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని బొక్కలగుట్ట గ్రామస్తులు డిమాండ్చేస్తున్నారు.