ఎంసీసీ ఆస్తుల వేలం వాయిదా..కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న మేనేజ్‌‌మెంట్‌‌

ఎంసీసీ ఆస్తుల వేలం వాయిదా..కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న మేనేజ్‌‌మెంట్‌‌

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల సిమెంట్ కంపెనీ (ఎంసీసీ) ఆస్తుల వేలం వాయిదా పడింది. ప్రస్తుతం రూ. కోటి చెల్లించడంతో పాటు మిగతా డబ్బులు వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తామని, వేలాన్ని వాయిదా వేయాలంటూ కంపెనీ మేనేజ్‌‌మెంట్‌‌ కోర్టుకు వెళ్లింది. దీంతో స్పందించిన కోర్టు వేలం నిర్వహణపై స్టే ఇవ్వడంతో సోమవారం జరగాల్సిన కంపెనీ ఆస్తుల ఈ–యాక్షన్‌‌ తాత్కాలికంగా వాయిదా పడింది. 

అప్పులు, ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన ఎంసీసీని 2019లో మూసివేశారు. కంపెనీ మూత పడేనాటికి రూ.39.40 కోట్లుగా ఉన్న ఇండియన్‌‌ బ్యాంక్‌‌ అప్పు.. ఈ సంవత్సరం నవంబర్‌‌ 31 నాటికి వడ్డీతో కలిపి రూ.54.04 కోట్లకు చేరింది. అప్పులు సకాలంలో చెల్లించకపోవడం, నోటీసులకు మేనేజ్‌‌మెంట్‌‌ స్పందించకపోవడంతో మంచిర్యాలలోని ఎంసీసీ ప్లాంట్ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న వందల ఎకరాల భూములను వేలం వేసేందుకు ఇండియన్‌‌ బ్యాంక్‌‌ నోటీసులు జారీ చేసింది. 

ప్రస్తుతం కోర్టు స్టేతో వేలం వాయిదాపడింది. కాగా, తమకు రావాల్సిన పెండింగ్‌‌ డబ్బులు చెల్లించకుండా కంపెనీ ఆస్తులు వేలం వేయడాన్ని నిరసిస్తూ ఎంసీసీ తొలగింపు కార్మికులు వారం రోజులుగా కంపెనీ మెయిన్‌‌ గేట్‌‌ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. వేలం వాయిదా పడడంతో దీక్షలను విరమిస్తున్నట్లు సోమవారం సాయంత్రం ప్రకటించారు.