జన్నారం, వెలుగు: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామానికి చెందిన కట్టెకొల రాములు భార్య అనసూయ పేరిట గతేడాది ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం కాకముందే అనసూయ మృతిచెందడంతో ఇల్లు మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది.
అప్పటి నుంచి తన పేరుపై ఇల్లు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. శుక్రవారం గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో ఈ విషయాన్ని సర్పంచ్, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన రాములు, అనంతరం పంచాయతీ కార్యాలయం పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఇల్లు మంజూరు చేయకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. సర్పంచ్ అజ్మీర కళావతి, కాంగ్రెస్ నాయకులు రాములను సముదాయించి ఇల్లు మంజూరయ్యేలా చూస్తామని చెప్పడంతో ట్యాంక్ దిగివచ్చాడు.
