ఎల్ మడుగు.. మొసళ్ల నిలయం .. వందకు పైగా క్రొకొడైల్స్.. ఎక్కడంటే..!

ఎల్ మడుగు.. మొసళ్ల నిలయం .. వందకు పైగా క్రొకొడైల్స్.. ఎక్కడంటే..!
  • గోదావరి మొత్తంలో ఇక్కడే ఎక్కువ పాపులేషన్
  • సందర్శించిన మద్రాస్​ క్రొకొడైల్​ బ్యాంక్​ ప్రతినిధులు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం శివ్వారం అభయారణ్యం పరిధిలోని గోదావరిలో గల ఎల్​ మడుగు మొసళ్లకు ఆవాసంగా విలసిల్లుతోంది. ఇక్కడ వందకు పైగా మొసళ్లు ఉన్నట్టు ఫారెస్ట్​ అధికారులు అంచనాకు వచ్చారు. ఆ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో త్వరలో చేపట్టనున్న క్రొకొడైల్​ సెన్సస్​లో భాగంగా ది మద్రాస్​ క్రొకొడైల్​ బ్యాంక్​ ఫౌండర్​ ట్రస్టీ గణేశ్​ ముత్తయ్య, అసిస్టెంట్​ డైరెక్టర్​ షఫీక్​ అహ్మద్​, డబ్ల్యూడబ్ల్యూఎఫ్​ ప్రతినిధి రాజశేఖర్​, చెన్నూర్​ ఇన్​చార్జి ఎఫ్​ఆర్​వో పోలోగి ప్రభాకర్​ శనివారం ఎల్​ మడుగును సందర్శించారు. ప్రిలిమినరీ సర్వే నిర్వహించారు. ఇక్కడి భౌగోళిక స్వరూపం, మొసళ్ల ఆవాసాలు, సమస్యలపై అధ్యయనం చేశారు. 

మొసళ్ల సంరక్షణ కేంద్రంగా గుర్తింపు..

ఎల్​ మడుగును మొసళ్ల సంరక్షణ కేంద్రంగా గుర్తించాలని 1972లో అప్పటి పీసీసీఎఫ్​ పుష్పకుమార్​ ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపారు. ఈ మేరకు ప్రభుత్వం 1978లో దానిని మొసళ్ల సంరక్షణ, పునరావాస కేంద్రంగా ప్రకటించింది. చుట్టూ ఎత్తైన కొండలు, రాతి పలకలతో గోదావరిలో సహజ సిద్ధంగా ఎల్​ మడుగు ఏర్పడింది. ఇది తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉండగా, ఏడు కిలోమీటర్లు కోర్​, రెండు కిలోమీటర్లు బఫర్​ ఏరియాతో విస్తరించింది. దాదాపు 20 మీటర్ల లోతు ఉంటుంది. రాతి పలకలపై ప్రవహించే నీరు భూమిలోకి ఇంకిపోకుండా ఏదాడి పొడవునా నిండుకుండను 
తలపిస్తోంది.

గోదావరి మొత్తంలో ఇక్కడే ఎక్కువ..

నాసిక్​ నుంచి బంగాళాఖాతంలో కలిసే గోదావరి మొత్తంలో ఎల్​ మడుగులోనే మొసళ్ల పాపులేషన్​ అధికంగా ఉందని అధికారులు తెలిపారు. పూర్తిగా రాతి పలకలతో ఏర్పడిన ఎల్​ మడుగు వాటి ఆవాసానికి అనుకూలంగా ఉన్నట్టు పలు అధ్యయనాల్లో రుజువైంది. 

మడుగులో పెరిగే చేపలను తింటూ ఉదయం, సాయంత్రం వేళల్లో రాతి పలకలపైకి వచ్చి సేదతీరుతుంటాయి. 2015–-16లో నిర్వహించిన క్రొకొడైల్​ సెన్సన్​లో ఇక్కడ 60కి పైగా మొసళ్లు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం వీటి సంఖ్య వందకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మగ్గర్​ జాతి మొసళ్ల జీవితకాలం సుమారు 70 ఏండ్లు కాగా, 3 నుంచి 3.5 మీటర్ల పొడవు, 150 నుంచి 200 కేజీల బరువు ఉంటాయి. ఏటా ఫిబ్రవరి, మార్చిలో రాతి పలకలు, ఇసుక తిన్నెల్లో గుడ్లు పెట్టి పొదుగుతాయి. జూన్​, జులైలో గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. ఒక్కో మొసలి దాదాపు 30 గుడ్లు పెడుతుందని ఎఫ్​ఆర్వో ప్రభాకర్​ తెలిపారు. ఎల్​ మడుగులో మొసళ్లతో పాటు 60కి పైగా నీటి కుక్కలు ఉన్నాయని చెప్పారు.


టూరిస్టులను ఆకట్టుకుంటున్న అభయారణ్యం..

శివ్వారం అభయారణ్యం ఎకో టూరిస్టులను, నేచర్​ లవర్స్​ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ అరుదైన నక్షత్ర తాబేళ్లు, పగడాల జెర్రిలు, చుక్కల దుప్పులు, నీలుగాయిలు, మనువోతులు, నెమళ్లు, అడవి కోళ్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. దీంతో ఫారెస్టు అధికారులు ఎల్​ మడుగును టూరిస్ట్​ స్పాట్​గా అభివృద్ధి చేశారు. టూరిస్టులు బోట్​లో విహరిస్తూ రాతి పలకలపై నోరు తెరిచి సేదతీరుతున్న మొసళ్లను చూసి మైమరిచిపోతారు. గోదావరి ఒడ్డున ఉన్న గుట్టపై గల వ్యూ పాయింట్​ నుంచి చూస్తే నలుదిక్కులా కనుచూపు మేరలో పచ్చని ప్రకృతి ఆహ్లాదం కలిగిస్తుంది. పురాతన గుళ్లు, ట్రెక్కింగ్​ మర్చిపోలేని అనుభూతిగా మిగులుతుంది.