V6 News

బొగ్గు గనుల పరిసరాల్లో పులి సంచారం.. భయాందోళనలో సింగరేణి ఉద్యోగులు, కార్మికులు

బొగ్గు గనుల పరిసరాల్లో పులి సంచారం..    భయాందోళనలో సింగరేణి ఉద్యోగులు, కార్మికులు
  • రాత్రిపూట అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
  • రామారావు పేట, గుత్తదారిపల్లి ప్రాంతాల్లో పెద్దపులి ఆనవాళ్లు  
  • డ్రోన్​ కెమెరాలతో గాలింపు చేపట్టిన ఫారెస్ట్​ ఆఫీసర్లు 

కోల్​బెల్ట్​/జైపూర్​వెలుగు: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ఏరియా సింగరేణి బొగ్గు గనుల పరిసరాల్లో పులి సంచారంతో ఉద్యోగులు, కార్మికుల్లో భయాందోళన నెలకొంది. రామకృష్ణాపూర్​ ఏరియా ఆస్పత్రి నుంచి హైదరాబాద్​కు అంబులెన్స్​లో చికిత్స కోసం తండ్రిని తీసుకెళ్తుండగా సింగరేణి కార్మికుడు రమేశ్​కు గురువారం రాత్రి ఆర్కే–-8 గని సమీపంలో పులి కనిపించింది. అతను వీడియో తీసి సోషల్​మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది.

 శ్రీరాంపూర్​ఓపెన్​కాస్ట్​ పరిసరాల్లో పులి తిరుగుతుందంటూ శుక్రవారం మరో రెండు వీడియోలు వైరల్​కావడంతో సింగరేణి ఉద్యోగులు తీవ్ర భయాందోళన నెలకొంది. వైరల్​అయ్యే వీడియోలపై స్పష్టత ఇవ్వని ఫారెస్ట్​ఆఫీసర్లు.. మూడు రోజులుగా మందమర్రి మండలం వెంకటాపూర్, మామిడిగట్టు, ఆదిల్​పేట ఎర్రచెరువు, వెంకటాపూర్​ గ్రామాల మీదుగా ఆర్కే–-8 మైన్​, శ్రీరాంపూర్​ఓసీపీ పరిసరాల్లో పెద్దపులి సంచరించినట్లుగా ధ్రువీకరించారు. 

గనుల్లో విధులకు వెళ్లే ఉద్యోగుల్లో..

శ్రీరాంపూర్ ​ ఏరియాలోని ఆర్కే-–7,-8, న్యూటెక్, శ్రీరాంపూర్​ఓసీపీ బొగ్గు గనులు అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నాయి. ఆయా గనుల్లో డ్యూటీలకు వెళ్లే ఉద్యోగులు అటవీని ఆనుకొని ఉన్న రోడ్డుపైనుంచి వెళ్తుంటారు. మూడు రోజులుగా పులిసంచారంతో  రాత్రి షిప్టు విధులకు వెళ్లే ఉద్యోగులు ఎటువైపు నుంచి పులి వస్తుందోనని భయపడుతున్నారు. కార్మికులను అప్రమత్తం చేయాలని శ్రీరాంపూ ర్​ ఏరియా సింగరేణి జీఎం ఎం.శ్రీనివాస్​ గనుల హెచ్​ఓడీలను ఆదేశించారు. రాత్రిపూట వెళ్లే కార్మికులు, ఉద్యోగులు అప్రమత్తం గా ఉండాలని, ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా, లైట్ల వెలుతురులో వెళ్లాలని సూచించారు. ఓసీపీ, పరిసరాల్లోకి వెహికల్​లోనే వెళ్లాలని 
పేర్కొంటున్నారు.

రామారావు పేట, గుత్తదారిపల్లి ప్రాంతాల్లోనే పెద్దపులి మకాం

మంచిర్యాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని జైపూర్ మండలంలోని రామారావు పేట, గుత్తదారిపల్లి సమీపంలో పులి తిరుగుతుందని అటవీ అధికారులకు సమాచారం అందింది. శుక్రవారం  డీఎఫ్ ఓ శివ ఆశిష్ సింగ్ ఆధ్వర్యంలో ఎఫ్ఆర్ఓ రత్నాకర్ ట్రాకర్ సిబ్బందితో కలిసి డ్రోన్​కెమెరాతో వెళ్లి గాలించారు. రామారావు పేట, గుత్తదారిపల్లి సమీపంలోకి వచ్చిన పెద్దపులి అక్కడే మకాం వేసిందని ఎఫ్ ఆర్ఓ రత్నాకర్ రావు తెలిపారు. 

ఉదయం నుంచి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో పులి పెద్దపులి సంచరిచిస్తున్నట్లు తెలిపారు. పులి ఆనవాళ్లను గుర్తించామని చెప్పారు. ఆ ప్రాంత సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బొగ్గు గనుల పరిసరాల్లో ఫారెస్ట్​ సిబ్బంది నిఘాను పెట్టారు.