ఏడాదిలోనే మంచుకొండ లిఫ్ట్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఏడాదిలోనే మంచుకొండ లిఫ్ట్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో ఖమ్మం జిల్లాను నెంబర్ వన్ గా నిలపడమే తన లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు తెలిపారు. ఆయిల్  పామ్  సాగులో ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉందని, మూడేళ్లలో దేశంలోనే నెంబర్​వన్ గా రాష్ట్రాన్ని నిలబెడతామన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో రూ.66.33 కోట్లతో నిర్మించిన మంచుకొండ లిఫ్ట్  ఇరిగేషన్  స్కీమ్​ను, వెంకటాయపాలెం లో 33/11 కేవీ సబ్  స్టేషన్​ను ఆయన ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి  మాట్లాడుతూ గత ఏడాది ఇదే రోజు మంచుకొండ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసి, ఏడాదిలో సాగునీటిని విడుదల చేస్తానని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్  సహకారంతో పనులను సకాలంలో పూర్తి చేశామని తెలిపారు.

 రఘునాథపాలెం మండలంలోని గిరిజనులు, చిన్న, సన్నకారు రైతులకు కృష్ణ నది నీళ్లు అందించేందుకు నాగార్జున సాగర్  ఎడమ కాల్వపై లిఫ్ట్  ఏర్పాటు చేసి సాగునీటి ఆకాంక్ష తీర్చామని చెప్పారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి, అరచేతిలో వైకుంఠాన్ని చూపించిన పార్టీ ఇప్పుడు యూరియా కొరత అంటూ కారుకూతలు కూస్తోందన్నారు. 

గత పాలకులు చేసిన నష్టాలను భరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా, ఆర్థికంగా ఆటంకాలు ఉన్నప్పటికీ తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

సీతారామ పూర్తయితే పుష్కలంగా నీళ్లు..

నాగార్జునసాగర్  ప్రాజెక్టు మీద మంచుకొండ ఎత్తిపోతల పథకం చివరి లిఫ్ట్  అని, సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకుంటే గోదావరి జలాలు పుష్కలంగా లభిస్తాయని తెలిపారు. సాగర్ లో ఉన్న నీటితో రైతులు పంటలు పండించుకునేందుకు తాత్కాలికంగా ఈ లిఫ్ట్  ఏర్పాటు చేశామన్నారు. బుగ్గవాగు ప్రాజెక్టు పనులు పూర్తయితే లిఫ్ట్  లేకుండా గ్రావిటీ ద్వారా చెరువులు నిండుతాయని తెలిపారు. వచ్చే ఏడాది సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. 

అనంతరం రఘునాథపాలెం మండలంలో కాంగ్రెస్  మద్దతుతో గెలిచిన సర్పంచులను జిల్లా కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్  రాయల నాగేశ్వరరావు, అడిషనల్  కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి, సీపీ సునీల్ దత్, ఖమ్మం నగర మేయర్  పునుకొల్లు నీరజ, మున్సిపల్  కార్పొరేషన్  కమిషనర్  అభిషేక్  అగస్త్య, నేతలు తుమ్మల యుగంధర్, సాదు రమేశ్​రెడ్డి, ఏఎంసీ చైర్మన్  హన్మంత్​రావు, ఇరిగేషన్  ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, ఎన్పీడీసీఎల్​ ఎస్ఈ శ్రీనివాస చారి, ఆర్డీవో నరసింహా రావు, తహసీల్దార్  శ్వేత పాల్గొన్నారు.