
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ పార్టీలో కొనసాగరని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన ఒంటి మీద ఇప్పటి వరకు అన్ని పార్టీల కండువాలూ మారాయని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మందకృష్ణ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, రాహుల్ గాంధీతో ప్రభుత్వానికి లేఖ రాయించాలని చెప్పామని, ఇందుకోసం గాంధీ భవన్ కు వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినా స్పందంచలేదన్నారు.
రేవంత్ వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదంటూ మండిపడ్డారు. వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఎమ్మార్పీఎస్ చేసిన మానవీయ ఉద్యమాల్లో భాగస్వామి అని తెలిపారు. ఆయన వల్ల సమాజానికి మేలు జరిగిందన్నారు. తమ లక్ష్య సాధనకు ఎవరు మద్దతు తెలిపితే వారికి అండగా నిలుస్తామని చెప్పారు. వ్యక్తిగా రేవంత్ రెడ్డికి ఓపిక లేదు.. ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.