కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు

 కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు

అచ్చంపేట, వెలుగు: ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉన్న భారత రాజ్యాంగాన్ని దేశంలోని కొందరు అహంకారులు, నియంతలే వ్యతిరేకిస్తున్నారని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థపాక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్​ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేస్తూ ఎమ్మార్పీఎస్, దళిత, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నాగర్​కర్నూల్​జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన మహా నిరసన కార్యక్రమంలో మందకృష్ణ పాల్గొన్నారు. అంబేద్కర్​ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో తెలివితక్కువ సీఎంలలో కేసీఆర్​ మొదటి స్థానంలో ఉన్నారని ఆయన వ్యాఖ్యలతో రుజువైందన్నారు. రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదని, ఆర్టికల్​167 ద్వారా మార్చుకోవచ్చని చెప్పారు. ఇందిరాగాంధీ, మోడీలాంటి వారు రాజ్యాంగాన్ని, అంబేద్కర్​ను పొగిడారని, కానీ కేసీఆర్ లాంటి నియంతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ​క్షమాపణ చెప్పకపోతే మార్చి 4న హైదరాబాద్​లో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తామని హెచ్చరించారు.