మంగళ్ యాన్ శాటిలైట్​తో తెగిన లింక్​

మంగళ్ యాన్ శాటిలైట్​తో తెగిన లింక్​

బెంగళూరు: మన దేశ మార్స్ ఆర్బిటర్ క్రాఫ్ట్ లో ఇంధనం అయిపోయింది. సేఫ్​ లిమిట్ ను దాటి బ్యాటరీ డ్రెయిన్ అయింది. దీంతో ‘మంగళ్ యాన్’ టాస్క్ పూర్తయి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2013 నవంబర్ 5న పీఎస్ఎల్వీసీ–25 ద్వారా ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ (ఎంవోఎం)ను ఇస్రో రూ.450 కోట్ల ఖర్చుతో లాంచ్ చేసింది. 2014 సెప్టెంబర్ 24న ఎంవోఎం స్పేస్ క్రాఫ్ట్ తన మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్షలోకి ప్రవేశించింది. ‘‘ప్రస్తుతం ఎంవోఎం స్పేస్ క్రాఫ్ట్ లో ఇంధనం అయిపోయింది. శాటిలైట్ బ్యాటరీ డ్రెయిన్ అయింది. లింక్ తెగిపోయింది” అని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇంతకుముందు స్పేస్ క్రాఫ్ట్‌‌లో ఇంధనం ఉన్నప్పుడు గ్రహణం బారిన పడకుండా ఇస్రో.. ఆర్బిటల్ మ్యానోవర్లను చేయగలిగింది. ‘‘ఇటీవలే అంగారక గ్రహంపై గ్రహణాలు సంభవించాయి. వాటిలో ఒక గ్రహణం ఏడున్నర గంటలపాటు నడిచింది” అని అధికారులు చెప్పారు.

శాటిలైట్ గడువు ముగిసిపోయిందని, స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న ఇంధనం అయిపోయిందని వారు పేర్కొన్నారు. ‘‘ఒక గంట 40 నిమిషాలు మాత్రమే గ్రహణాన్ని హ్యాండిల్ చేసేలా శాటిలైట్​లోని బ్యాటరీని తయారు చేశాం. ఓ సుదీర్ఘ గ్రహణం వల్ల బ్యాటరీ డ్రెయిన్ అయిపోయి ఉండవచ్చు” అని ఆ ఆఫీసర్లు తెలిపారు. కాగా మార్స్ ఆర్బిటర్ దాదాపు ఎనిమిదేండ్ల పాటు పనిచేసిందని ఇస్రో అధికారులు వెల్లడించారు. స్పేస్ క్రాఫ్ట్ లో అమర్చిన మార్స్ కలర్ కెమెరా వెయ్యికిపైగా ఇమేజెస్ పంపిందని, మార్స్ అట్లాస్ ను కూడా క్యాప్చర్ చేసిందని చెప్పారు.