పైన నిగనిగ.. లోపల విషం: రంగు చూసి మామిడి పండ్లు కొంటే మోసపోయినట్టే..

పైన నిగనిగ.. లోపల విషం: రంగు చూసి మామిడి పండ్లు కొంటే మోసపోయినట్టే..
  • పక్వానికి రాకముందే తెంపి కార్బైడ్‌‌‌‌, ఇతర కెమికల్స్‌‌‌‌తో మాగబెడుతున్న వ్యాపారులు 
  • మార్కెట్‌‌‌‌లోకి మేలో రావాల్సిన పండ్లు.. మార్చి నుంచే అందుబాటులోకి.. 
  • తియ్యగా రసాలు ఊరాల్సినవి కాస్తా సప్పసప్పగా రుచీపచీ ఉండట్లేదు 
  • ఇలాంటి పండ్లు తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడ్తుందని డాక్టర్ల హెచ్చరిక

కరీంనగర్, వెలుగు:  పైకి పచ్చగా బంగారు వర్ణంతో నిగనిగలాడుతూ కనిపిస్తున్న మామిడి పండ్ల లోపల కాలకూట విషం ఉంటున్నది. రంగు చూసి పొంగిపోయి తింటే.. రసాలు ఊరాల్సినవి కాస్తా రుచీపచీ లేకుండా చప్పగా ఉంటున్నాయి. బయట ఆకట్టుకునే తొక్క ఉంటున్నా వాటిలో తియ్యదనం మచ్చుకైనా ఉంటలేదు. నిషేధిత కాల్షియం కార్బైడ్‌‌‌‌‌‌‌‌తోపాటు ఇతర ఇథిలిన్ రైపనర్లతో మగ్గబెట్టడం వల్లే మామిడి పండ్లు ఇలా మారుతున్నట్టు తెలుస్తున్నది. నిజానికి మేలో రావాల్సిన మామిడి పండ్లు హైదరాబాద్ ​ప్రధాన మార్కెట్లలోకి మార్చి నుంచే దర్శనమిస్తున్నాయి. 

వ్యాపారుల లాభాపేక్షే ఇందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో గాలి దుమారానికి రాలిన మామిడి కాయలతో పాటు పక్వానికి రాకముందే కోసిన కాయలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. వాటిని మగ్గబెట్టేందుకు నిషేధిత కెమికల్స్‌‌‌‌‌‌‌‌ను వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా మామిడి విక్రయాలు జరిగే జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్, మంచిర్యాల తదితర  జిల్లాల్లోని మార్కెట్లతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వ్యాపారులు ఇవే పద్ధతులు అనుసరిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా వీటిని తింటున్న జనం రోగాలబారిన పడ్తున్నారు. 

కార్బైడ్‌‌తో మగ్గించిన పండ్లు హెల్త్‌‌పై తీవ్ర ప్రభావం చూపిస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. మెగ్నీషియం, కార్బన్స్ ప్రభావం ఎక్కువై అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. ముఖ్యంగా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గి,  ప్రధాన అవయవాల పనితీరుపై ప్రభావం పడ్తుందని హెచ్చరిస్తున్నారు. 

మార్చి నుంచే మార్కెట్‌‌లోకి.. 

మామిడికాయలు సహజంగా పక్వానికి వస్తేనే పండుగా మారి తీపిదనం వస్తుంది. మన దగ్గర మామిడి రకాల్లో చాలా వరకు మే నెలలోనే పక్వానికి వస్తుంటాయి. పక్వానికి వచ్చిన కాయలే సహజ పద్ధతిలో పండ్లుగా మారుతాయి. కానీ చాలా మంది రైతులు గాలిదుమారానికి కాయలు రాలుతాయని, పక్వానికి వచ్చే వరకు చూస్తే పురుగు వస్తుందనే భయంతో కాయ సైజ్ పూర్తిగా పెరగకముందే తెంపుతున్నారు. కొన్ని రకాల హైబ్రిడ్ మామిడి కాయలను మార్చి, ఏప్రిల్ నెలల్లోనే కోసి మార్కెట్‌‌లోకి తీసుకొస్తున్నారు. 

ఇలాంటి కాయలను వ్యాపారులు కొనుగోలు చేసి కార్బైడ్, ఇథలిన్ రైపనర్లను వినియోగించి త్వరగా పసుపు పచ్చ రంగులోకి మారేలా మగ్గబెడుతున్నారు. దీంతో రెండు, మూడు రోజుల్లోనే రంగు మారినప్పటికి రుచి మాత్రం ఉండడం లేదు. వీటిని ఎక్కువ ధరకు అమ్మేస్తూ వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు.
 

రైపనర్లతో మగ్గబెడుతూ..   

గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కాల్షియం కార్బైడ్ వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఆ తర్వాత వేర్వేరు పేర్లతో మార్కెట్‌‌లోకి అందుబాటులోకి వచ్చిన ఇథలిన్ రైపనర్లను వ్యాపారులు వినియోగిస్తున్నారు. కాయలను మగ్గబెట్టడానికి ఈఎన్ రైప్ అనే ఫ్రూట్ రైపనర్‌‌‌‌కు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. కానీ చైనా నుంచి దిగుమతి అవుతున్న అనేక రైపనర్లు మార్కెట్‌‌లో అందుబాటులో ఉన్నాయి. 

స్టార్ రైప్, మ్యాంగో కింగ్ లాంటి రైపనర్లను నీళ్లలో ముంచి తీసి మామిడి కాయల మధ్య పెడితే కాల్షియం కార్బైడ్‌‌తో సమానంగా పని చేస్తున్నాయి. స్టార్ రైప్ కూడా ఒక రకంగా కాల్షియం కార్బైడ్ అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి సీజన్‌‌లో ఈ దందా నడుస్తున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోల్‌‌సేల్ మార్కెట్ల వైపు కన్నెత్తి చూడడం లేదు. 

పండ్లలో తేడాను గుర్తించండిలా.. 

సహజంగా పండిన మామిడి పండ్లు.. పసుపు లేత ఆకుపచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పక్వం వచ్చి ఉంటుంది. పండును ఒత్తితే కొద్దిగా మెత్తగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా త్వరగా పాడైపోదు. సహజంగా మగ్గిన పండ్ల వాసన కొద్ది దూరం వరకు వస్తుంది. కాల్షియం కార్బైడ్, ఇథిలిన్ రైపనర్ వాడిన పండ్లకు.. మామిడి పండ్లకు వచ్చే సహజ వాసన రాదు. పండు మొత్తం అట్రాక్టివ్‌‌గా లేత పసుపు రంగులో ఉంటుంది. పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా, రుచి పుల్లగా ఉంటుంది. పండు తొక్క మడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది. ఈ పండ్లు త్వరగా పాడైపోతాయి. 

కార్బైడ్‌‌తో మగ్గించిన పండ్లు హానికరం..

కార్బైడ్‌‌తో మగ్గించిన పండ్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతాయి. మెగ్నీషియం, కార్బన్స్ ప్రభావం ఎక్కువై అనారోగ్యం తలెత్తుతుంది. ప్రధాన అవయవాలపైనా ప్రభావం చూపిస్తాయి. అందుకే సహజంగా మగ్గిన పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. కార్బైడ్‌‌తో మగ్గించిన పండ్లు చూడడానికి నిగనిగలాడుతాయి. 

కానీ రుచిగా ఉండవు. నేను కూడా ఇటీవల హుజూరాబాద్‌‌లో మామిడి పండ్లను కొని, ఇంటికి తీసుకెళ్లి తిన్న తర్వాత  తెలిసింది.. అందులో కొన్ని రసాయనాలతో మగ్గించిన పండ్లు అని. అందుకే కొనేటప్పుడే జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే.  
- డాక్టర్ శ్రీకర్ మోడెపు