మామిడి దిగుబడి ఢమాల్.. అకాల వర్షాలకు రాలిన కాయలతో రైతులు ఆగం

మామిడి దిగుబడి ఢమాల్.. అకాల వర్షాలకు రాలిన కాయలతో రైతులు ఆగం
  • అడ్డగోలుగా పంటను కొంటున్న వ్యాపారులు, దళారులు
  • మార్చిలో టన్ను రూ.90 వేలకుపైగా  పలికిన ధర
  • ఈనెల ప్రారంభంలో టన్ను రూ.80 వేల నుంచి రూ.60 వేలే
  • ఇప్పుడు సగానికి సగం పడిపోయిన రేటు
  • జిల్లా మార్కెట్లలో  రూ.20 వేలు కూడా దాటట్లే  

హైదరాబాద్, వెలుగు: అటు ప్రకృతి వైపరీత్యాలు, ఇటు మార్కెట్  లేకపోవడంతో మామిడి రైతు చితికిపోతున్నాడు. ఇటీవలే కురిసిన అకాల వర్షాలతో కాయదశలోనే మామిడి పంటకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి పంట సాగుచేస్తే వాతావరణ పరిస్థితులు అనుకూలించక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిందె దశ నుంచి కంటికి రెప్పలా కాపాడినప్పటికీ ఈదురు గాలుల బీభత్సంతో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు మామిడికాయలు, పిందెలు రాలిపోయాయని, దిగుబడి భారీగా పడిపోవడంతో నష్టాన్ని చవిచూస్తున్నామని వాపోయారు. 

 రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 2.85 లక్షల ఎకరాల్లో మామిడితోటల సాగు జరుగుతోంది. ఏటా 10.23 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని హార్టికల్చర్​ అధికారులు తెలిపారు. తాజాగా మార్చిలో కురిసన వర్షాల వల్ల దిగుబడి అంచనాల్లో 60 శాతమే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా బంగినపల్లి రకం మామిడితో పాటు కేసరి, హిమాయత్, తోతాపురి, చిన్న, పెద్ద రసాలు, సువర్ణరేఖ, నీలం, చెరుకురసం లాంటి మామిడిరకాలు పండిస్తున్నారు. వాటిలో ప్రధానంగా బంగిగనపల్లి మామాడి 85 శాతం వరకు ఉంటుంది. 

అయితే, ఈయేడు మామిడి రైతులకు మార్కెట్​ కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే పూత, పిందెల సమయంలో వాతావరణ మార్పుల ప్రభావంతో దిగుబడి అంతంతే ఉంది. తాజాగా మార్కెట్​కు వస్తున్న మామిడికాయలను వ్యాపారులు అగ్గువకు కొంటుండడంతో  రైతులు నష్టపోతున్నారు. మామిడి రేటు మార్చి నెలలో అత్యధికంగా టన్ను రూ.90 వేలు పలికింది. మార్చి నెలాఖరు వచ్చే సిరికి  రూ.70 వేలకు వరకు విక్రయాలు జరిగాయి. ఈనెల ప్రారంభంలో టన్నుకు రూ.60 వేలు పలికిన ధరలు.. నేడు సగానికి పడిపోయాయి. 

ప్రస్తుతం మామిడికాయల రేటు టన్నుకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు నడుస్తున్నది. కొంచెం క్వాలిటీ ఉన్న కాయలు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. జగిత్యాల, ఖమ్మం, వరంగల్​ తదితర జిల్లాల్లో టన్నుకు రూ.20 వేలు పలుకుతోంది. హైదరాబాద్​ ఫ్రూట్​ మార్కెట్​లో టన్నుకు రూ.32 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతోంది.

మామిడికి మార్కెట్​ కష్టాలు కూడా

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మార్కెట్  వసతి లేకపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను దూర ప్రాంతాలకు తీసుకెళ్లలేక ప్రైవేట్  వ్యాపారులు, దళారులకు విక్రయించి మరింత నష్టపోతున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్  జిల్లాల్లోని పలు మండల ప్రాంతాల నుంచి రైతులు మామిడికాయలను హైదరాబాద్​కు తీసుకురాగా ప్రైవేటు వ్యాపారులు, దళారులు, కమీషన్  ఏజెంట్లు అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నారు. కౌలు తీసుకున్న రైతు.. మామిడితోటకు సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధించి, కాయలను మర్కెట్ కు తరలించి మంచి ధర వస్తేనే రైతుకు లాభసాటిగా ఉంటుంది. 

వీటిలో ఏది సక్రమంగా జరక్కపోయినా తీవ్రంగా నష్టపోతాడు. దీనికితోడు కౌలుకు తీసుకుని సాగుచేసిన రైతులకూ ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్  మార్కెట్ కు తరలిస్తే ఎక్కువ రేటు వస్తుందనుకుంటే ట్రాన్స్ పోర్ట్  ఖర్చులకే సరిపోవడం లేదని, స్థానికంగా అమ్మేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో పంట అగ్గువకు కొంటున్న వ్యాపారులు, మధ్య దళారులే బాగు పడుతున్నారని, తమకు గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నరు.