మునుగోడులో విజయం మాదే

మునుగోడులో విజయం మాదే

 

  • మునుగోడు ప్రచారానికి వెంకట్​రెడ్డి రాకపోయినా ప్రాబ్లమ్​ లేదు
  • అది ఆయన వ్యక్తిగత నిర్ణయం: మాణిక్కం ఠాగూర్ 
  • కాంగ్రెస్​ వ్యక్తుల మీద డిపెండ్​ కాదు 
  • పార్టీ​లో భిన్నాభిప్రాయాలు సహజం
  • జనరల్​ ఎలక్షన్లలో 78 సీట్లు వస్తాయి
  • టీఆర్​ఎస్​తో​ పొత్తు ప్రసక్తే లేదు.. 
  • చిన్న పార్టీలను కలుపుకుపోతాం
  • మునుగోడులో విజయం మాదే
  • ‘వెలుగు’తో రాష్ట్ర కాంగ్రెస్​ ఇన్ చార్జ్


హైదరాబాద్​, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాకపోయినా ఫరవాలేదని, ఆయన పరిమితులను తాము అర్థం చేసుకోగలమని రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​చార్జ్ మాణిక్కం ఠాగూర్​ అన్నారు. వెంకట్ రెడ్డికి ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు హైకమాండ్​ సిద్ధమైందనీ, తామంతా ఆయనతో మాట్లాడి కలుపుకుపోతామని అన్నారు. కాంగ్రెస్​ ఎప్పుడూ వ్యక్తుల మీద ఆధారపడదని, క్యాడర్​ని నమ్ముకొని పని చేసుకుపోతుందని చెప్పారు. తెలంగాణ ఇన్​చార్జ్ గా బాధ్యతలు తీసుకొని త్వరలో రెండేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు. రెండేండ్ల పని తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని మాణిక్కం తెలిపారు. పార్టీని బలోపేతం చేశామని, దేశంలోనే రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేశామన్నారు. రెండేండ్లలో వరుస ఓటములపై ప్రశ్నించగా.. దుబ్బాక, నాగార్జునసాగర్​, హుజూరాబాద్​, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం విపరీతంగా ఉందన్నారు.

ఇద్దరు, ముగ్గురుంటరు..

నేతల మధ్య విభేదాల సంగతి ప్రస్తావించగా.. తమ పార్టీ చాలా పెద్ద కుటుంబం అని అందులో ఇద్దరు, ముగ్గురికి భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమని మాణిక్కం చెప్పారు. ఇక్కడ చాలా కొద్ది మందికి మాత్రమే కొన్ని సమస్యలున్నాయన్నారు. వాటిని చాలా వరకు పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు. వెంకట్​రెడ్డి ఇటీవల రేవంత్​, మాణిక్కంలను మార్చాలని చేసిన డిమాండ్​పై ప్రశ్నించగా తాము సోనియా ప్రతినిధులుగా ఆ బాధ్యతల్లో ఉన్నామన్నారు. సోనియా తమను వద్దనుకుంటే అభ్యంతరం లేదన్నారు. 

కల్వకుంట్ల కుటుంబాన్ని సాగనంపుతం

తెలంగాణను దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబాన్ని సాగనంపడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని మాణిక్కం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమకు 78 సీట్లు వస్తాయన్నారు. తెలంగాణలో సునీల్​ కనుగోలు పాత్రపై ప్రశ్నించగా ఆయన తమ పార్టీ సభ్యుడని. సెగ్మెంట్లు, అభ్యర్థుల బలాబలాల వారీగా పరిశీలన జరుపుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదన్నారు. టీఆర్​ఎస్​తో అస్సలే పొత్తు పెట్టుకోమని, చిన్న పార్టీలు వస్తే కలుపుకుపోతామని చెప్పారు.

ప్రియాంక ఎంట్రీ ఎందుకు? 


తెలంగాణ వ్యవహారాలపై ప్రియాంక గాంధీ ఎందుకు దృష్టి సారించాల్సి వచ్చిందని ప్రశ్నించగా తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్​ క్షేత్ర స్థాయి నుంచి బలంగా ఉందని తాము నమ్ముతున్నామనీ, అందుకే ఆమె ఈ రెండు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్​ పెట్టారన్నారు. ఎప్పటికప్పుడు తెలంగాణ పరిణామాలను సమీక్షించి ప్రియాంక తమకు తగిన దిశానిర్దేశనం చేస్తారని చెప్పారు.

మునుగోడుకు మూడేండ్ల నుంచి ఏం చేయలే..

మునుగోడులో రాజగోపాల్​ రెడ్డి ఏమీ చేయలేదని మాణిక్కం అన్నారు.‘‘మూడేళ్ల ముందు నుంచే రాజగోపాల్​ కాంగ్రెస్​ను విమర్శిస్తూ, బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నరు. అందుకే ఆయనను కాంగ్రెస్​ ఎమ్మెల్యేగా ఉన్నట్లు పరిగణించడం లేదు. కేవలం కాంట్రాక్టుల కోసం పార్టీ మారారు. ఇది మునుగోడు ప్రజలు, మా క్యాడర్​ గుర్తించారు. అందుకే అక్కడ మేం మంచి మెజారిటీతో గెలుస్తం’’ అని అన్నారు. 

మునుగోడు అభ్యర్థుల పేర్ల పరిశీలన పూర్తి

మునుగోడులో పోటీ చేసే కాంగ్రెస్ ఆశావహుల పేర్ల పరిశీలన పూర్తయింది. ఆ వివరాలు హైకమాండ్​కు పంపించారు. త్వరలో అధిష్టానం నిర్ణయం వెల్లడించనుంది. గురువారం గాంధీభవన్​లో ఆశావహులతో సమావేశం జరిగింది. పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమక్షంలో ఆశావహులు తమ బలాబలాలు, అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలిసింది. పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాశ్ నేతలు గాంధీభవన్ వచ్చి నేతలతో భేటీ అయ్యారు.

తర్వాత వీళ్లు మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ ఆశిస్తున్న తాము తమ అభిప్రాయాలను తెలిపామని, అవి హైకమాండ్​కు వెళ్తాయన్నారు. తమలో ఎవరికి అవకాశం దక్కినా కలిసి పని చేస్తామన్నారు. కాగా, మునుగోడులో తాజా పరిస్థితులపై వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజా రిపోర్టును పీసీసీకి అందజేసినట్లు తెలిసింది. అభ్యర్థి ఖరారు విషయంలో సీఎల్పీ నేత భట్టి.. ఎంపీ వెంకట్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. మునుగోడు బరిలో ఎవరు నిలిస్తే బాగుంటుందో అడిగేందుకు తాను వచ్చారనని, వెంకట్ రెడ్డి అభిప్రాయాన్ని హైకమాండ్​కు తెలియజేస్తామని భట్టి తెలిపారు. మునుగోడు ప్రచారంలో పాల్గొంటానని వెంకట్ రెడ్డి చెప్పారు.