మణిపూర్ టు ముంబై.. రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర

మణిపూర్ టు ముంబై..  రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర
  • జనవరి 14 నుంచి మార్చి 20 వరకు రాహుల్​ పర్యటన
  • 14 రాష్ట్రాలు.. 85 జిల్లాలు.. 6,200 కిలో మీటర్లు
  • బస్సు, కాలినడకన ప్రయాణంజనవరి 14న ప్రారంభమై.. 
  • మార్చి 20న ముగింపు ఇంఫాల్​లో యాత్రను ప్రారంభించనున్న ఖర్గే

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. ‘భారత్ న్యాయ్ యాత్ర’ పేరుతో చేపట్టే ఈ యాత్ర మణిపూర్​లో ప్రారంభమై ముంబైలో ముగుస్తుంది. మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాలను ఈ యాత్ర కవర్ చేస్తుంది. రాహుల్‌‌‌‌ యాత్ర ఈసారి హైబ్రీడ్‌‌‌‌ మోడల్‌‌‌‌లో సాగనుంది. అంటే.. బస్సు ద్వారా, కాలి నడక ద్వారా యాత్ర సాగుతుంది. జనవరి 14న ప్రారంభమై 67 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. “భారత్ న్యాయ్ యాత్ర 6,200 కి.మీ. కొనసాగుతుంది. జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ముగుస్తుంది. బస్సు, కాలి నడక ద్వారా ప్రజల సమస్యలు వింటూ రాహుల్ ముందుకు వెళ్తారు. భారత్ జోడో యాత్ర 136 రోజుల పాటు కొనసాగింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా సుమారు 4వేల కిలో మీటర్లు రాహుల్ నడిచారు. ఆర్థిక అసమానతలు, నియంతృత్వమే ఎజెండాగా భారత్ జోడో యాత్ర కొనసాగింది. ప్రజల సామాజిక, ఆర్థిక, పొలిటికల్ జస్టిస్ ఎజెండాగా భారత్ న్యాయ్ యాత్ర నిర్వహిస్తున్నాం” అని జైరామ్ రమేశ్ తెలిపారు.

నేడు నాగ్​పూర్​లో మెగా ర్యాలీ

జనవరి 14న మణిపూర్​లోని ఇంఫాల్​లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే జెండా ఊపి భారత్ న్యాయ్ యాత్రను ప్రారంభిస్తారని జైరామ్ రమేశ్ తెలిపారు. నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, చత్తీస్​గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర గుండా యాత్ర సాగుతుందన్నారు. గురువారం (నేడు) కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్​పూర్​లో ‘మేము రెడీగా ఉన్నాం’ (హమ్ తయార్ హై) అనే పేరుతో మెగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2024 లోక్​సభ ఎన్నికలకు ఈ మెగా ర్యాలీ కొత్త ఊపు ఇస్తుందన్నారు. 

ఈస్ట్ నుంచి వెస్ట్​కు ‘భారత్ న్యాయ్ యాత్ర’

న్యాయ్ యాత్రలో భాగంగా మహిళలు, యూత్, అణగారిన వర్గాలతో రాహుల్ మాట్లాడుతారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈస్ట్ నుంచి వెస్ట్ కు యాత్ర కొనసాగుతుందన్నారు. సమయం తక్కువగా ఉండటంతో రాహుల్ ఈ యాత్రను బస్సు, నడుచుకుంటూ కంప్లీట్ చేస్తారని తెలిపారు. రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్ల కారణంగా మణిపూర్ గాయపడిందని, దాన్ని నయం చేసేందుకే యాత్రను మణిపూర్ నుంచి ప్రారంభిస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు.

దేశమంతా ఎదురుచూస్తున్నది: కాంగ్రెస్

‘భారత్ న్యాయ్ యాత్ర’ కోసం దేశమంతా ఎదురు చూస్తున్నదని రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఈ యాత్ర.. జాతీయ ప్రయోజనాల్లో సరికొత్త అధ్యాయం అని తెలిపారు. ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా కాంగ్రెస్ లీడర్​షిప్ మరింత బలపడుతుందన్నారు. ప్రజలందరికీ న్యాయం దొరుకుతుందని తెలిపారు. పార్టీ, ప్రజల సహకారంతోనే యాత్ర సక్సెస్ అవుతుందన్నారు.

కాంగ్రెస్​ను ప్రజలు నమ్మరు: బీజేపీ

ప్రజలను మోసం చేసేందుకే ‘భారత్ న్యాయ్ యాత్ర’ పేరుతో కాంగ్రెస్ జనాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి విమర్శించారు. ప్రధాని మోదీ హయాంలో ప్రతి ఒక్కరికి న్యాయం దొరుకుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరగలేదని, అందుకే జనం ఆ పార్టీని నమ్మరని అన్నారు.