తీహార్ జైలుకు సిసోడియా.. 20 వరకు కస్టడీ

తీహార్ జైలుకు సిసోడియా.. 20 వరకు కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ (ఈనెల 20 వరకూ) విధించింది.  దీంతో మరికాసేపట్లో ఆయన్ను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఇప్పటికే వారం రోజుల పాటు సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించించారు. ఈ నెల 20వ తేదీ వరకూ సిసోడియా రిమాండ్ లోనే ఉండనున్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గత ఆదివారం (ఫిబ్రవరి 26న) సిసోడియాను 8 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు. తెల్లవారే కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీ విధించింది. అనంతరం మళ్లీ కోర్టు ప్రవేశపెట్టగా మరో రెండు రోజుల కస్టడీ విధించింది. ఈ గడువు ముగియడంతో సీబీఐ అధికారులు ఇవాళ మరోసారి సిసోడియాను కోర్టులో ప్రవేశపెట్టారు. 

ప్రస్తుతం ఢిల్లీలో పలు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ముఖ్యంగా సిసోడియాను తీహార్ జైలుకు తరలించే ప్రాంతంలో బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించాయి. ఇటు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు వద్ద కూడా భద్రతను పెంచారు. 

మరోవైపు.. ఆప్ నేతలు అరెస్ట్ లపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఆప్ కు పోటీగా బీజీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మనీష్ సిసోడియా అరెస్ట్‌ను ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటికే విపక్షాలు లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి సహా 9 మంది విపక్ష నేతలు ప్రధాని మోడీకి లేఖ రాశారు. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నేతలు. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు నిరంకుశత్వమని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని లేఖ రాసిన వారిలో సీఎంలు, మాజీ సీఎంలు, ముఖ్య నేతలు ఉన్నారు.

ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ బీజేపీ పాలనా విధానాలను తూర్పారబట్టారు. అంతేకాదు.. విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయడం, బీజేపీలో చేరగానే ఆ కేసులను నీరుగార్చడం జరుగుతోందని విమర్శించారు.