మాంజాదారం మెడకు చుట్టుకొని మూడేళ్ల బాలుడు మృతి

మాంజాదారం మెడకు చుట్టుకొని మూడేళ్ల బాలుడు మృతి

చెన్నై: తమిళనాడులోని కొరుక్కుపేటలో విషాదం జరిగింది. తండ్రితో కలసి మోటార్‌బైక్‌పై వెళుతున్న మూడేళ్ల బాలుడి మెడకు మాంజా దారం చుట్టుకోవడంతో తీవ్రగాయమై మృతి చెందాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో గోపాల్ అనే వ్యక్తి తన మూడేళ్ల కొడుకు అభిమన్యుతో కలసి తోండియార్‌పేట్‌ లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి కొరక్కుపేటలోని తన ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలోని ఓ కరెంట్ పోల్ నుంచి వేలాడుతున్న  మాంజా దారం బాలుడి మెడకు వచ్చి చుట్టుకుంది. బైక్ వేగంతో వెళ్లడంతో ఆ దారం బాలుడి మెడను కోసేసింది. ప్రమాదం జరిగిన వెంటనే గోపాల్..  అభిమన్యు కాలు బైక్ చక్రంలో ఇరుక్కుపోయిందని భావించి వాహనాన్ని ఆపాడు.  వెంటనే దగ్గర్లోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుళ్లాడు.  అయితే, ఆసుపత్రికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే  అభిమన్యు తీవ్ర రక్తస్రావమై మరణించాడు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఆర్.కె.నగర్ పోలీసులు ఆసుపత్రికి చేరుకొని బాలుడి వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని ఆ దారం యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.