డేంజర్లో మంజీర బ్రిడ్జీ.. అధిక లోడ్ తో వెళ్తే ఊగుతున్న బ్రిడ్జీ..

డేంజర్లో మంజీర బ్రిడ్జీ.. అధిక లోడ్ తో వెళ్తే ఊగుతున్న బ్రిడ్జీ..

20 టన్నుల కంటే ఎక్కువ బరువున్న వెహికల్స్ అనుమతించొద్దు
నిజామాబాద్ కలెక్టర్ కు మహారాష్ట్ర ఇంజనీరింగ్ ఆఫీసర్ల రిపోర్ట్
పట్టించుకోని నిజామాబాద్ ఆర్అండ్ బీ ఆఫీసర్లు

బోధన్, వెలుగు: మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మంజీర బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడడంతో కూలిపోయే ప్రమాదం ఉందని మహారాష్ట్రకు చెందిన పబ్లిక్ వర్క్ డివిజన్ ఇంజనీరింగ్ ఆఫీసర్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించారు. నిజామాబాద్ నుంచి సాలూర చెక్పోస్టు
గుండా వెళ్లే ఎన్హెచ్-63 నిర్మాణంలో భాగంగా మంజీర నదిపై 1985లో 800 మీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జిని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వై.వి.చౌహాన్ ప్రారంభించారు. 2017లో ఈ బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడి ఊగుతోందని, బేరింగ్ల సౌండ్ వస్తోందని వాహనదారులు ఫిర్యాదు చేశారు. దీంతో మహారాష్ట్ర ఆఫీసర్లు తాత్కాలికంగా నియోప్రెన్ బేరింగ్స్, రోలార్ బేరింగ్స్, జాయింట్లు, పగుళ్లు వంటి పనులు చేశారు. పనులు పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ ఆఫీసర్లు బ్రిడ్జిపై 40 టన్నుల కంటే అధిక బరువుతో వెళవద్దని బోర్డులు ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేశారు.

మళ్లీ ఏర్పడిన పగుళ్లు
మంజీర నది బ్రిడ్జిపై మళ్లీ పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడడంతో దెగ్లూర్ ఇంజనీరింగ్ ఆఫీసర్లు ముంబయి ఇంజనీరింగ్ ఆఫీసర్లకు సమాచారం అందించారు. వాళ్లు బ్రిడ్జిని పరిశీలించి రిపోర్టు తయారు చేయాలని ఔరంగాబాద్ ఇంజనీరింగ్ ఆఫీసర్లకు సూచించారు. ఔరంగాబాద్ ఇంజినీరింగ్ ఆఫీసర్లు వారం రోజులు పరిశీలించి బ్రిడ్జి ప్రమాదకరంగా ఉందని రిపోర్టు పంపించారు. దీంతో ముంబయి ఇంజనీరింగ్ ఆఫీసర్లు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. బ్రిడ్జిపై నుంచి 20 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉన్న వెహికల్స్ వెళ్లవద్దని సూచించారు. బ్రిడ్జికి రెండు వైపులా హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే 3.80 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న వెహికల్స్ రాకుండా బోర్డులు ఇరువైపులా ఏర్పాటు చేయాలన్నారు. 50 టన్నుల కంటే అధికలోడ్ ఉన్న వెహికల్స్ పక్కనే 50 మీటర్ల దూరంలోని పాత బ్రిడ్జిని వినియోగించుకోవాలని సూచించారు.

వెహికల్స్ రూట్ మళ్లించాలి
మంజీర బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా ఉండడంతో తెలంగాణ, మహారాష్ట్ర రెండు వైపుల నుంచి వచ్చే వాహనాలను రూట్ మళ్లించాలని సూచించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు వచ్చే వెహికల్స్ బిలోలి, కొండల్వాడి, నాగిని నుంచి మంజీర నదిపై ఉన్న ఖండ్గావ్ బ్రిడ్జి పైనుంచి కల్దుర్కి, రాంపూర్ మీదుగా బోధన్ కు చేరుకోవచ్చునన్నారు. ఇలా వెళితే 29 కిలోమీటర్లు దూరం ఎక్కువగా వస్తుందన్నారు. అలాగే రెండో రూట్ బిలోలి, కొండల్వాడి, ధర్మాబాద్ నుంచి గోదావరి నదిపై బ్రిడ్జిమీదుగా తెలంగాణలోని కందకుర్తి, పెగడపల్లి మీదుగా బోధన్ కు చేరుకోవచ్చున్నారు. ఇలా వెళితే 55 కిలోమీటర్ల దూరం వస్తుందని తెలిపారు. అన్ని వివరాలతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు రిపోర్ట్ తయారు చేసి పంపారు. మహారాష్ట్ర ఆఫీసర్లు రిపోర్ట్ ఇచ్చి నెల రోజులు దాటుతున్నా ఓవర్ లోడ్ వెహికల్స్ వెళడ్లం మాత్రం ఆగలేదు. అధికలోడ్ తో ఉన్న వెహికల్స్ వెళ్లినపుడు బ్రిడ్జి ఊగుతోందని ఇతర ప్రయాణికులు, సమీప గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే బ్రిడ్జి క్రింద వైపు రెండు చోట్ల
పగుళ్లు ఏర్పడ్డాయి . బ్రిడ్జి కూలిపోతే అంతరాష్ట్ర రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి.

For More News..

కరెంట్ షాకుతో రైతు దంపతుల మృతి