- మెదక్ లో ఘటన
 
మెదక్, వెలుగు : ఎన్ని సార్లు ఆఫీస్‌ల చుట్టూ తిరిగినా తన సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదనకు గురైన ఓ వృద్ధురాలు సోమవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట బ్లేడ్‌తో చేయి కోసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన మసీద్‌పల్లి వెంకటమ్మకు 318/29 సర్వే నంబర్‌లో 9.20 ఎకరాల భూమి ఉంది. అర ఎకరం భూమి ధరణిలో మరొకరి పేరు మీద మారగా.. మిగతా భూమిని అదే గ్రామానికి చెందిన 12 మంది కబ్జా చేశారని వెంకటమ్మ ఆరోపించింది.
భూమిలోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యకం చేసింది. తన భూమి తనకు ఇప్పించాలని ఐదేండ్లుగా తిరుగుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సోమవారం మెదక్ కలెక్టరేట్ వద్దకు చేరుకొని బ్లేడ్‌తో చేయి కోసుకుంది. గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరపాలని నర్సాపూర్ ఆర్డీవోను ఆదేశించారు.
ఇదే విషయంపై కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ... సదరు వృద్ధురాలు ఇప్పటివరకు తహసీల్దార్ ఆఫీస్‌కు రాలేదన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం.. భూమి ఆమె పేరు మీద లేదన్నారు. భూమికి సంబంధించిన పత్రాలు ఏమైనా ఉంటే తీసుకురావాలని చెప్పినా లేదన్నారు. విచారణకు వస్తామని చెప్పినా గ్రామంలో ఉండడం లేదన్నారు.
