నవీ ముంబై: వరల్డ్ కప్ నెగ్గాలన్న కలను సాకారం చేసుకున్న టీమిండియా ప్లేయర్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. సౌతాఫ్రికా చివరి బ్యాటర్ క్యాచ్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పట్టుకోగానే మొదలైన సంబరాలు స్టేడియంలో కొన్ని గంటల వరకూ సాగాయి. విజయం సాధించిన వెంటనే కోచింగ్ స్టాఫ్ జాతీయ జెండాలను మైదానంలోకి తీసుకొచ్చారు.
రాధా యాదవ్ ఇచ్చిన జెండాను చుట్టుకొని హర్మన్‌ప్రీత్, మంధాన ఫొటోలకు పోజిచ్చారు. జాతీయ జెండాతో స్టేడియంలో నిర్వహించిన విక్టరీర్యాలీలో లెజెండరీ ప్లేయర్లు మిథాలీ రాజ్, అంజుమ్ చోప్రా, ఝులన్ గోస్వామి, రీమా మల్హోత్రాను కూడా తమతో పాటు తీసుకువెళ్లారు. విజయం తర్వాత కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి ప్లేయర్లు పాడిన విజయగీతం ‘రహేగా సబ్ సే ఊపర్ హమారా తిరంగా!.. హమ్ హై టీమ్ ఇండియా, హమ్ హై టీమ్ ఇండియా’ స్టేడియంలో ప్రతిధ్వనించింది.
ప్రతీకకు పిలువు
ట్రోఫీని అందుకోవడానికి కొద్ది క్షణాల ముందు కనిపించిన దృశ్యాలు అందరి మనసులను కదిలించాయి. నాకౌట్‌కు ముందు కాలు విరగడంతో జట్టుకు దూరమైన యంగ్ ఓపెనర్ ప్రతీక రావల్‌ను వీల్‌చైర్‌లో మంధాన గ్రౌండ్‌లోకి తీసుకొచ్చింది. తన మెడలో ఉన్న పతకాన్ని తీసి రావల్ మెడలో వేసి పోడియంపైకి తీసుకెళ్లింది. ఆట ముగిసిన వెంటనే కోచ్ అమోల్ మజుందార్‌కు హర్మన్ కాళ్లు మొక్కి గురుభక్తి చాటుకుంది. ప్లేయర్లు తెచ్చిచ్చిన జాతీయ జెండాను మజుందార్ పిచ్‌పై పాతి గర్వంగా నిల్చున్నాడు.
ప్రత్యర్థులనూ ఓదార్చి
ఫైనల్లో ఓడిన  తమ ప్రత్యర్థులను ఇండియా ప్లేయర్లు అభినందించడం మర్చిపోలేదు. సఫారీ సీనియర్ క్రికెటర్ మరిజేన్ క్యాప్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోగా.. జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకుని ఓదార్చారు. సౌతాఫ్రికా కెప్టెన్ వోల్‌వార్ట్‌ను ఓదార్చిన స్మృతి మంధాన, దీప్తి శర్మ ఆమెతో కొంతసేపు మాట్లాడారు. హోటల్‌కు చేరుకున్న తర్వాత కూడా ప్లేయర్లు సంబరాలు కొనసాగించారు. తమ రూమ్ బెడ్స్‌పై ట్రోఫీతో దిగిన ఫొటోలను మంధాన, జెమీమా, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ సోషల్ మీడియాలో
 షేర్ చేశారు.
