2009లో బరాక్ ఒబామా అమెరికాకు మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా విజయం సాధించి యూఎస్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఒబామా గొప్ప రాజకీయ వక్త, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం తర్వాత ఆయన ఇలా అన్నారు. ‘ఎన్నికలు కొన్ని పరిణామాలను కలిగి ఉంటాయి. దురదృష్టం వెంటాడితే నువ్వు ఓడిపోతావు’.
ఒబామా ఉద్దేశం అధికారం చేతులు మారిందని. అయితే, కొద్ది కాలంలోనే ఒబామా ఆయన ఆశించిన మేరకు ప్రజాదరణ పొందలేని అమెరికా అధ్యక్షుడయ్యాడు. అంటే, బరాక్ ఒబామా వ్యాఖ్యానించిన మాటలు ఆయన రాజకీయ జీవితంలోనే వాస్తవ రూపం దాల్చాయి. వాస్తవానికి 2016లో అమెరికా అధ్యక్షుడు ఒబామా పట్ల ఆ దేశ ప్రజల అనూహ్య వ్యతిరేక ఫలితంగానే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యారని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, నవంబర్ 14న దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
బిహార్ అసెంబ్లీ ఎలక్షన్ ఫలితాలు భారతదేశ రాజకీయాల్లో పెద్ద ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రధానంగా అధికార బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి తో పాటు, ప్రతిపక్ష ఇండియా కూటమిపై బిహార్ ఫలితాలు తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశమూ లేకపోలేదు. ఓటమి అనేది ఏ కూటమికి ఎదురైనా ఎన్డీఏ కూటమి కన్నా ఇండియా కూటమిపై కాస్త ప్రభావం ఎక్కువ ఉండొచ్చు. అయితే, బిహార్లో బీజేపీ ఓటమిప్రధాని నరేంద్ర మోదీని కూడా ప్రభావితం చేస్తుంది.
బిహార్‌ను అధికార బీజేపీ ప్రతిష్టాత్మక సమస్యగా మార్చకూడదు. ఫాల్స్ ప్రెస్టేజ్ కారణంగా యుద్ధాల ఫలితాలు తారుమారవుతాయి. హిట్లర్ 1941లో రష్యాపై యుద్ధం ప్రకటించాడు. హిట్లర్ సైన్యాలు వేగంగా ముందుకు కదిలాయి, కానీ, రష్యన్ నగరమైన లెనిన్‌గ్రాడ్‌లో చిక్కుకుపోయాయి. లెనిన్ గ్రాడ్‌ను స్వాధీనం చేసుకోవడం హిట్లర్ ప్రతిష్టకు సమస్యగా మారింది. రష్యన్ నాయకుడు స్టాలిన్ హిట్లర్‌ను యుద్ధంలో ఓడిపోయేలా చేశాడు.
మోదీపై బిహార్ ప్రభావం
బిహార్లో ఓడితే నరేంద్ర మోదీ రాజకీయ  ప్రతిష్టను దెబ్బతీస్తుంది. కానీ,  మోదీ ప్రధానిగా  కొనసాగేందుకు ఎటువంటి ఆటంకం ఎదురవ్వకపోవచ్చు.  2015లో  బిహార్‌లో,  2022లో  కర్నాటకలో,  2018లో రాజస్తాన్, చత్తీస్‌గఢ్,  మధ్యప్రదేశ్‌లో  జరిగిన ఎన్నికల్లో  నరేంద్ర మోదీ గతంలో ఓటమిని చవిచూశారు.  త్వరలో జరగబోయే  బిహార్ రాష్ట్ర ఎన్నికల్లో ఓటమిపాలైనా  ఆ ఎన్నికలు కేవలం రాష్ట్ర ఎన్నికలు మాత్రమే అని మోదీ, బీజేపీ నాయకులు చెబుతారు. 
కానీ, బిహార్‌లో ఓటమి అంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తన ఆర్థిక, వ్యవసాయ విధానాలను పున: సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆరోగ్యం వంటి రంగాల్లో ప్రధానిగా మోదీ విజయం సాధించినప్పటికీ, ఆయన వ్యవసాయరంగం, రైతులు, మధ్యతరగతి ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించారని ఎన్నికల్లో ఓటమి పరోక్షంగా నిరూపిస్తుంది.
కాబట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనాపరంగా తాను అవలంబిస్తున్న ప్రస్తుత ఆర్థిక విధానాలపై సమీక్షించి మార్పులు చేయాలి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ పాలనలో మధ్యతరగతి ప్రజలు, రైతులు సంతోషంగా ఉండకపోతే, మౌలిక సదుపాయాల కల్పనకోసం పెట్టుబడులు పెడితే సరిపోదు అని మోదీ అర్థం చేసుకుంటారు. బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైతే కచ్చితంగా ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం వంటి మిత్రపక్షాలు మరిన్ని రాజకీయ ప్రయోజనాలను కోరుతాయి.
ఇండియా కూటమి మనుగడ..
బీహార్‌లో  ప్రతిపక్ష ఇండియా కూటమి  ఓడిపోతే ఆ కూటమి మనుగడను  ప్రమాదంలో పడుతుంది.  అంటే,  రాహుల్ గాంధీ రాజకీయాలు, ఆలోచనలు  బిహార్ ఎన్నికల్లో  ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని వెల్లడవుతుంది. ఇది రాహుల్ గాంధీకి  రాజకీయ చతురుతకు పెద్ద  ప్రశ్నగా మారుతుంది.  రాహుల్ గాంధీ  ప్రతిపక్ష  నేతగా  ముందుకుసాగాలంటే కాంగ్రెస్ బిహార్‌లో మెరుగైన విజయం సాధించి రాణించాలి. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ  ఓటమి అంటే  ‘రైల్వే భూములకు ఉద్యోగాల కుంభకోణం’ వంటి  వివిధ  కేసులు వేగవంతం అవుతాయి. 
లాలూ కుటుంబానికి ఇది కచ్చితంగా బాధాకరమైన సమయం అవుతుంది. ఎందుకంటే కుంభకోణాలపై దర్యాప్తు ముమ్మరమైన వారు జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. లాలూ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా, కేసులు తొలగిపోవు. కానీ, ఓటమిపాలైతే మహాఘట్బంధన్ నేత లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ కూడా తన స్థాయిని కోల్పోతాడు. బిహార్‌లో ఓటమి అంటే, త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో ఇండియా కూటమికి మరోసారి బీజేపీ నుంచి రాజకీయ యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇది ఇండియా కూటమి ఐక్యతకు పరీక్ష కూడా కావచ్చు. ఇండియా కూటమి ఐక్యతను చాటాల్సిన అవసరం ఇకపై జరిగే ప్రతి ఎన్నికల్లోనూ చాటు కోవాల్సి ఉంది.
ఇండియా కూటమి గెలిస్తే..
బిహార్లో ఇండియా కూటమి గెలిస్తే ఎన్డీఏ సర్కారు  తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఇండియా కూటమి పార్లమెంటుకు హాజరు కావడానికి నిరాకరించి,  ఎన్నికల కమిషన్‌ను రద్దు చేసి, నరేంద్ర మోదీ ప్రతిష్టను తగ్గించే చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేయవచ్చు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీచే అవకాశం ఉంది. బీజేపీని ఓడించడానికి ఉత్తరప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో  ఇండియా కూటమి దూకుడు  ఎన్నికల ప్రచారాలు ఉంటాయి. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రమైన సవాలును ఎదుర్కొంటారు.  బీజేపీ తన మొత్తం వ్యూహాలను మార్చుకోవాలి లేదా అది ఓటమిని ఎదుర్కొంటుంది. మోదీ ఆకర్షణ తగ్గుముఖం పడుతుందనే భావన భారతదేశ ప్రజల్లో నెలకొంటుంది. 
దేశవ్యాప్తంగా బీజేపీ వృద్ధి ఆగిపోతుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు నిరంతరం గెలవలేవు. అయితే, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ కచ్చితంగా ఊహించలేరు. బిహార్‌లో ఓటమి ఒక సంవత్సరం తర్వాత ఏమీ ప్రభావం చూపకపోవచ్చు. ఓటమి లేదా విజయం లాభాలు, పరిణామాల ప్రభావం ఎక్కువగా ఇండియా కూటమికి, రాహుల్ గాంధీకి, తేజస్వీ యాదవ్‌కు, మొత్తం ప్రతిపక్షంపై ఉంటుంది.బీజేపీకి విజయం లేదా హంగ్ అసెంబ్లీ కూడా సరిపోతుంది. కానీ, ఇండియా కూటమికి, ఇది స్పష్టమైన విజయం అయి ఉండాలి. నవంబర్ 14 నాడు ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
అందరికీ ప్రతిష్టాత్మకమే !
దేశంలో జరిగే ప్రతి ఎన్నికలు రాజకీయ పరిణామాలను కలిగి ఉంటాయి. నవంబర్ 14,  2025న బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఆ గెలుపు కారణంగా వారికి పెద్ద బహుమతి లభిస్తుంది.  బిహార్ ఎన్నికల ఫలితాలపై  కీలక నాయకులు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,  బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్,  పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ,  ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుటుంబంతోపాటు  అనేకమంది ఇతర నాయకుల రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 
విజయం విజేతలకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. పరాజితులపై ఓటమి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అధికార దాహంతో ఉన్న రాజకీయ నాయకులు బిహార్‌ను చిన్న రాష్ట్రంగా మార్చారు. రాజకీయ కురుక్షేత్రంగా మార్చారు. కానీ, బిహార్ నుంచి ఏ ఒక్కరూ ప్రధానమంత్రి కాలేదు. యావత్తు భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసేంతగా బిహార్ నుంచి నిజంగా పెద్ద నాయకులు ఎవరూ ఉద్భవించలేదు. 2029 వరకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సజావుగా సాగాలంటే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ రాష్ట్రాన్ని గెలవాల్సిన అనివార్యత ఉంది. అదేవిధంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికీ గెలుపు అనివార్యం. ఇండియా కూటమి అస్తిత్వానికీ అదొక సవాలు కాబట్టి!
డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్
