హైదరాబాద్, వెలుగు: ఫాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్స్ తెలంగాణ చిట్యాలలోని తన రెండో తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. రూ. 120 కోట్ల పెట్టుబడితో దీనిని 40 ఎకరాల్లో నిర్మించింది. చిట్యాల ప్లాంట్ కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 50వేల మెట్రిక్ టన్నులు పెంచుతుంది. దీనితో ఫాబెక్స్ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం లక్ష మెట్రిక్‌టన్నులకు చేరుకుంది.
విజయవాడలో కూడా కంపెనీకి ఒక ప్లాంట్ ఉంది. రాబోయే మూడేళ్లలో తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడానికి రూ. 100 కోట్ల పెట్టుబడి పెట్టాలని సంస్థ భావిస్తోంది. ఈ అదనపు పెట్టుబడి ఆటోమేషన్, ఉత్పత్తి పెంపుదలపై దృష్టి పెడుతుంది. ప్రస్తుతం 400 మంది ఉద్యోగులు ఉండగా, కార్యకలాపాలు పెరిగే కొద్దీ ఉద్యోగుల సంఖ్యను 800 కి రెట్టింపు చేయాలని ఈ హైదరాబాద్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
కంపెనీ మూడు సంవత్సరాలలో రూ. వెయ్యి కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకుంది. తాము ఉత్తర అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం సహా మూడు ఖండాలకు స్టీల్ ఎగుమతి చేస్తున్నామని కో–-ఫౌండర్స్ వేణు చావా, రమణ రాజు వెల్లడించారు.
