న్యూఢిల్లీ: మ్యాన్‌కైండ్ ఫార్మా ఐపీఓ ఈ నెల 25న మొదలై 27 వరకు సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. కంపెనీ తన యాంకర్ బుక్‌ను ఏప్రిల్ 24న మొదలుపెట్టింది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.1,026–1,080గా నిర్ణయించారు. ప్రమోటర్లు 4 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా అమ్ముతారు. తాజా ఇష్యూ లేదని కంపెనీ ప్రకటించింది. అప్పర్‌బ్యాండ్ వద్ద ఇది రూ. 4,326.35 కోట్లు సమీకరించనుంది.
ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు రమేష్ జునేజా, రాజీవ్ జునేజా, శీతల్ అరోరా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కోటికి పైగా షేర్లను అమ్ముతారు. ఓఎఫ్ఎస్లోని మిగిలిన షేర్లను ఇన్వెస్టర్లు కెయిర్న్‌హిల్ సీఐపీఈఎఫ్, కెయిర్న్‌హిల్ సీజీపీఈ, బీజ్ లింక్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అమ్ముతాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తం డబ్బు వాటాదారులకే వెళ్తుంది. కంపెనీ ఖాతాలోకి రాదు. పెట్టుబడిదారులు కనీసం 13 ఈక్విటీ షేర్లు కొనాలి. ఒక లాట్ ధర రూ. 14,040 ఉంటుంది.
